Princton Human Trafficking: మనుషల అక్రమ రవాణా ( Human Trafficking) కు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో యుఎస్‌లో కిందటేడాది అరెస్టైన నలుగురు తెలుగు వ్యక్తులకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారిపై చేసిన ట్రాఫికింగ్ ఆరోపణలను ప్రిన్సటన్ పోలీసులు ఉపసంహరించుకున్నారు. అమెరికాలో కన్సల్టెన్సీ నడుపుతున్న తెలుగు వ్యక్తులు చందన్ దాసిరెడ్డి, ద్వారక గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలే అక్రమంగా మనుషులను నిర్బంధించి ట్రాఫికింగ్ కు పాల్పడున్నారని ఆరోపణలు వచ్చాయి. కిందటేడాది మార్చిలో టెక్సాస్‌లోని ప్రిన్స్‌టన్‌లో జరిగిన ఓ సంఘటనతో వీరిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణలో మొత్తం నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని జూలై 9న అధికారికంగా బయటపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వీరిపై ఉన్న ట్రాఫికింగ్ చార్జెస్ డ్రాప్ చేస్తూ Princeton Police Department డిస్ట్రిక్ట్ అటార్నీకి పంపిన లేఖలను వారి తరపు న్యాయవాది జి.వంశీకృష్ణ మీడియాకు అందజేశారు.
పొరపాటు వల్ల వచ్చిన సమస్య ఇది
జూలై 9న నలుగురు తెలుగు వ్యక్తులను అరెస్ట్ చేసిన విషయం బయటకు రావడం కలకలం రేపింది. ఐటీ కన్సల్టెన్సీ పేరుతో ట్రాఫికింగ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవడంలో జరిగిన పొరపాటు కారణంగానే ట్రాఫికింగ్ ఆరోపణలు వచ్చాయని వారి తరపు న్యాయవాది చెప్పారు. దేశిరెడ్డి చందన్ రెడ్డి, కట్కూరి సంతోష్ రెడ్డి, గుండా ద్వారక టెక్సస్ లో ఐటీ జాబ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారని.. చదువు పూర్తిచేసుకున్న గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి స్థానికంగా ఉన్న ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తారని న్యాయవాది చెప్పారు. చదువు పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లకు ఎలాంటి ఆదాయ మార్గాలు ఉండవని.. ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు వీసా, ఉద్యోగ విషయాల్లో సహకారం అందించి.. వాళ్లకు ఉద్యోగాలు వచ్చిన తర్వాతనే కొంత మొత్తాన్ని తీసుకుంటారని చెప్పారు. ఇప్పటి వరకూ 1500మంది రిజిస్టర్ చేసుకుని 700మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. అయితే కొంతమందికి సొంతంగా వసతి కూడా లేని పరిస్థితుల్లో తామే కంపెనీ గెస్ట్ హౌస్ లో వాళ్లకి వసతి కల్పించామని.. రెగ్యులర్ క్లీనింగ్ లో భాగంగా పెస్ట్ కంట్రోల్ వాళ్లని పిలిపించినప్పుడు.. అక్కడ ఒకే హాలులో ఎక్కువమంది ఉన్న అమ్మాయిలను చూసి పొరపడి పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.
పెస్ట్ కంట్రోల్ వాళ్ల ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి తలుపులు కొట్టడంతో అక్కడి అమ్మాయిలు, దోపిడీ ఏమైనా జరుగుతుందేమో అని కంగారు పడి దాక్కున్నారని ఆ పరిస్థితిని చూసి పోలీసులు అనుమానపడి.. గెస్ట్ హౌస్ కేర్ టేకర్ సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారని… ఆ తర్వాత నిర్వాహకులపై ఒక్కొక్కరిగా కేసులు పెట్టారని చెప్పారు. పోలీసులు వచ్చినప్పుడు అమ్మాయిలు ఫోన్ చేయగానే సంతోష్ అక్కడకు చేరుకున్నారని.. తప్పు చేసి ఉంటే పోలీసులకు దొరక్కుండా తప్పించుకునే వారుగా అని న్యాయవాది వంశీకృష్ణ తెలిపారు. అయితే ప్రొసీజర్ ప్రకారం కన్సల్టెన్సీ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని .. విచారణ చేసిన తర్వాత వారిపై ఉన్న ట్రాఫికింగ్ చార్జెస్ ను విత్ డ్రా చేసుకున్నారని చెప్పారు.
మరిన్ని చూడండి