హమ్మయ్య..! ఎట్టకేలకు గోవా టూరిజం ఎందుకు పడిపోయిందో తెలిసిపోయింది. ఇడ్లీ సాంబారు, వడా పావ్ వల్ల గోవా టూరిజం పడిపోయిందట. గోవా లోని బిజెపి ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. గోవాను సందర్శించడానికి వచ్చేవాళ్ళలో ఇతర దేశాలకు సంబంధించిన టూరిస్టులు ఎక్కువ అని వాళ్లకి బీచ్ లోని రెస్టారెంట్లలో ఇడ్లీ సాంబార్, వడా పావ్ అటు వంటకాలు మాత్రమే దొరకడం వల్ల తినలేక గోవాకి టూరిస్టులు రావడం తగ్గించేసారని సదరు ఎమ్మెల్యే కొత్త భాష్యం చెప్పారు.

గోవా లోని రెస్టారెంట్ల యజమానులు తమ హోటళ్ల ను ఫుడ్ కోర్టులను బయట రాష్ట్రాల వాళ్ళకి లీజ్ కు ఇవ్వడంతో ఇలా వేరే వేరే వంటకాలు పెడుతున్నారని కాకుండా గోవా సంప్రదాయ వంటకాలు, కాంటినెంటల్ ఫుడ్ అందుబాటులో ఉంచితే టూరిస్ట్లు ఎక్కువగా వస్తారని ఆయన అంటున్నారు. గోవా కు వచ్చేవాళ్ళలో రష్యా ఉక్రెయిన్ ప్రాంతాల పర్యాటకులు ఎక్కువగా ఉంటారని కానీ ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతూ ఉండడం వల్ల రావడం తగ్గించేసారని కూడా లోబో చెప్పారు. ఈ యుద్ధం సంగతి ఎలా ఉన్నా ఇడ్లీ సాంబార్ వల్లే పర్యాటకులు గోవాకి రావడం తగ్గించేసారంటూ ఎమ్మెల్యే లోబో చేసిన ప్రకటన పై సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయ్.

అయితే నిన్న మొన్నటి వరకు గోవాలో టూరిజం ఏ మాత్రం తగ్గలేదని కావాలనే కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని గోవా ప్రభుత్వం సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇన్నాళ్ళకి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇండైరెక్టుగా నన్నా గోవా టూరిజం పడిపోయింది అని ఒప్పుకున్నారు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

టాక్సీ మాఫియా, అధిక ధరలు అసలు కారణం : రిపోర్ట్స్

గోవా వెళ్ళొచ్చే పర్యాటకుల నుండి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట గోవాలో పెరిగిపోయిన ధరలు , టాక్సీ మాఫియా వల్లే టూరిజం పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. "లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉండదు కేవలం అక్కడ టాక్సీ వాళ్ళు ఎంత చెబితే అంత ఇచ్చి బుక్ చేసుకోవాలి. ఓటు బ్యాంకు కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రవేశపెట్టి ఆలోచన ప్రభుత్వం చేయదు. రోడ్లన్నీ ఇరుకు. గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పోనీ బైక్ లాంటివి అద్దెకు తీసుకుందాం అనుకున్నా రకరకాల కారణాలు చెప్పి ఎక్కువ మొత్తం వసూలు చేస్తారు. తో ఈ టాక్సీ వాళ్ళు ఏం చెప్తే దానికి తలొగ్గాల్సి వస్తుంది " అనేది అక్కడకు వెళ్లి వచ్చిన పర్యాటకులు చెప్తున్న మాట. అలాగే హోటల్ రూమ్స్ ధరలు విపరీతంగా పెంచేశారు.

గోవాలో రూమ్ రెంట్ల కంటే బ్యాంకాక్ శ్రీలంక లాంటి వేరే దేశాల్లో చాలా చౌకగా రూమ్స్ దొరుకుతాయి. కాబట్టి పర్యాటకులు గోవా కంటే ఆయా దేశాల్నే ప్రిఫర్ చేస్తున్నారంటూ రిపోర్ట్స్ చెప్తున్నాయి. పై పెచ్చు చిన్న చిన్న విషయాలకే టూరిస్టులపై అక్కడ దాడులు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం న్యూ ఇయర్ వేడుకలు ఎంజాయ్ చేద్దాం అని వెళ్ళిన తాడేపల్లిగూడెం యువకుడ్ని ఒక హోటల్ కుర్రాళ్ళు కొట్టి చంపేశారు.
ఇలాంటి అసలు కారణాలపై దృష్టి పెట్టకుండా ఇడ్లీ సాంబార్ వల్ల గోవా టూరిజం పడిపోయిందని చెబుతున్న రాజకీయ నాయకుల మాటలు నవ్వుల పాలవుతున్నాయి.