పవన్ కళ్యాణ్ ప్రసంగం.. ఓ ప్రభంజనం

అవును.. ఏపీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని కొట్టిన తొడలు బద్దలు కొట్టా, వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించా. మనం నిలబడ్డాం, పార్టీని కూడా నిలబెట్టాం. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టాం. భయం లేదు, భయమన్నది నా ఒంట్లోనే లేదు.. ఇల్లు దూరమైనా చేతిలో దీపం లేకపోయినా.. అన్ని ఒక్కడినే అయ్యి ముందుకు నడిచాను.. ఇదీ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం చిత్రాడలో జరిగిన ఆవిర్భావ సభలో చేసిన కీలక ప్రసంగం. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ అంగరంగ వైభవంగా.. ప్రత్యర్థులు, విమర్శకులు సైతం వామ్మో.. అని నోరెళ్ళబెట్టేలా అదరహో అనిపించింది. పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్, మెగాభిమానులు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివచ్చి జనసేన చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేశారు. ఇక పవన్ తన రాజకీయ జీవితంలో ఇంతవరకూ ఎన్నడూ చేయని ప్రసంగాన్ని చేసి ఇదీ సేనాని రేంజి అని అనిపించుకున్నారు. పవన్ మాట్లాడిన ఒక్కో మాట, ప్రత్యర్థులపై విసిరిన పంజా తొలి నిమిషం మొదలు పూర్తయ్యే వరకూ సభికులు తదేకంగా చూడగా.. సభకు వెళ్ళలేని అభిమానులు, కార్యకర్తలు టీవీలు, యూట్యూబ్ లకు అతుక్కుపోయాను. జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ప్రతి విషయాన్ని టచ్ చేస్తూ సేనాని సుదీర్ఘ ప్రసంగం చేశారు.

అవమానాలు.. కుట్రలను ఛేదించి..

ఒక్కడిగా 2014లో ప్రయాణం మొదలు పెట్టాను. ఈ రోజు ఈ స్థాయి దాకా వచ్చాం. 2019లో పార్టీ ఓడిపోయినప్పుడు ఒక్కక్కరూ మీసాలు మెలేశారు. జబ్బలు చరిచారు. తోడలు కొట్టారు. మన ఆడపడుచుల్ని ఘోరంగా అవమానించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇదేం న్యాయం? ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాను ఏంటి? అని వీర మహిళలు అడిగితే కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. ఆఖరికి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు నారా చంద్రబాబును కూడా జైల్లో పెట్టారు. నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్‌ చేశారు. అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించాం. గత ఐదేండ్లు ఏపీలో హింసను సాగించారు. ప్రతిపక్షాలను వేధించారు. నన్ను వైసీపీ నేతలు తిట్టని తిట్టు లేదు. వీటన్నిటికీ చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్పాను. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్‌లో అడుగు పెట్టాం. దేశమంతా మన వైపు చూసేలా 100 శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించాం. భావ తీవ్రత ఉంది కనుకే పోరాట యాత్ర చేశాం. ఓటమి భయంలేదు కాబట్టే 2019లో పోటీచేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రా అయ్యింది. తెలంగాణ నాకు పునర్జన్మ ఇచ్చింది. కొండగట్టులో కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ. హోలీ రోజున జయకేతనం ఎగరవేయడం ఆ దేవుడి దీవెన. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంతో దుమ్ము దులిపేశారు.

జనసేనకు 11 ఏళ్లు.. వైసీపీకి 11 సీట్లు

నేను అనేక ఇబ్బందులు పడి 11 ఏళ్లపాటు జనసేనను నడిపాను. మన పార్టీకి 11వ సంవత్సరం.. సరిగ్గా వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశాం. నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణంగా మాత్రమే పనిచేసింది. 2003లోనే ఇంట్లో అమ్మానాన్నలకు రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పాను. చంటి సినిమా హీరోయిన్ని ఎలా పెంచుతారో అలా నన్ను పెంచారు. నేను డిగ్రీ పూర్తి చేసి ఎస్‌ఐను కావాలని మా నాన్న అనేవారు. బయటికి వెళ్తే ఏమవుతానో ఏంటో? అని ఇంట్లో ఎప్పుడూ భయపడేవారు. నేను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఎవరూ ఊహించి ఉండరు. సినిమా నా జీవితం కాదని ఆ రోజు చెప్పలేకపోయాను. ఖుషీ సినిమా తర్వాత గద్దర్ కలిశారు. ఏ మేరా జహా అనే పాటలో దృశ్యాలు చూసి గద్దర్ నన్ను అభినందించారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. నువ్వు దేశం కోసం.. సమాజం కోసం ఆలోచించేవాడివని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీపతి రాముడు నన్ను ఎంతోగానో ప్రభావితం చేశారు. 2006 లో ఢిల్లీ నుంచి వచ్చి రాజకీయాల్లోకి వస్తారా? అని నన్ను అడిగారు. రాజకీయాలపై అవగాహన లేదని, మెచ్యూరిటీ వచ్చాక వచ్చి కలుస్తానని చెప్పాను. ఇప్పటికీ ఆయన్ను కలుస్తుంటాను. అణగారిన వర్గాల కోసం పని చేసే వ్యక్తి మన ప్రొఫెసర్. నా గుండెల నుంచి ప్రొఫెసర్ గారికి ప్రేమను మాత్రం ఇవ్వగలను సగటు మధ్యతరగతి మనిషిగా బతకడమే నా కోరిక అని తన సినీ, రాజకీయ జీవతం గురుంచి క్లుప్తంగా అంతకు మించి ఆసక్తికరంగా జనసైనికులతో పవన్ పంచుకున్నారు.

బహు భాషలు ఉండాల్సిందే..

తమిళనాడులో పెను తుఫానుగా మారి కేంద్రం – స్టాలిన్ సర్కార్ మధ్య జరుగుతున్న రచ్చపై పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభా వేదికగా మాట్లాడారు.భారతదేశానికి బహుభాషా విధానమే మంచిది. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలి. దేశ ఐక్యత కోసం బహుభాషా విధానం ఉండాలి. తమిళనాడు షణ్ముఖ్ యాత్రకు వెళ్తే అక్కడివారు నాపై ఎంతో ప్రేమ చూపించారు. తమిళనాడు ప్రజలందరికీ మనస్పూర్తిగా నమస్కారాలు. మహారాష్ట్ర వెళ్తే అక్కడ కూడా రాజకీయ పరంగా కూడా నాపై ఎంతో అభిమానం చూపించారు. మొత్తానికి చూస్తే త్రిభాషా సూత్రంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నేను కర్మ చేస్తాను, ఫలితం ఆశించను. భయాలు, బాధ్యతల మధ్య జీవితం సాగించాను. జనసేన కోసం 7 సిద్ధాంతాలు చాలా ఆలోచించి పెట్టినవి. 100 శాతం స్ట్రైక్‌రేట్‌ సాధించామంటే దానికి జనసేన సిద్ధాంతాలే కారణం. భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వాన్ని చూడటమే నా ఐడియాలజీ అని పవన్ స్పష్టం చేశారు. 

నాన్న సీఎం అయ్యుండాలా?

పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి అయి ఉండాలా? మామయ్య కేంద్రమంత్రి అయి ఉండాలా? బాబాయి చంపించి ఉండాలా?దశాబ్దం పాటు తిట్లు భరించాలంటే ఎంత నలిగి ఉండాలి? వ్యక్తిగా ఎదగాలి, అధికారమే ముఖ్యం దాని కోసం గూండాలను వాడుకుంటాం హత్యలు చేయిస్తాం, చేసుకుంటూ పోతాం అంటే కుదరదు. వేలాది కోట్లు దోచేస్తాం, కులాల మధ్య చిచ్చు పెడతాం. కోడికత్తిని వాడుకుంటాం, తద్వారా లాభపడతామన్నది ఇంకో పద్దతి. నేను అలాంటివి ఏమీ ఎంచుకోలేదు. సైద్ధాంతిక విధానాన్నే ఎంచుకున్నాను. ఎంత పోరాటం చేస్తే ఇక్కడి దాకా వచ్చాం.  పార్టీని, నన్ను అర్థం చేసుకోవాలి. దశాబ్దం పాటు పార్టీని నడిపానంటే నా వ్యక్తి గత జీవితం నుంచి ఆరోగ్యం వరకూ ఎంతో కోల్పోయాను. మార్షల్ ఆర్ట్స్‌లో మూడు గ్రానైట్ రాళ్లు పెట్టి పగులకొట్టించుకున్న నేను ఇప్పుడు నా రెండో కొడుకుని కూడా ఎత్తుకోలేనంత బలహీనపడ్డాను. ప్రజలందరి ఆశీర్వాదంతో తిరిగి బలం తెచ్చుకుంటాను. అయినా ఈ జయకేతనం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. సమాజంలో మార్పు కోసం మాత్రమే వచ్చా, ఓట్ల కోసం కాదు. భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడమే నా ఐడియాలజీ అని పవన్ స్పష్టం చేశారు. కాగా ఇటీవల కార్పొరేటర్‌కు ఎక్కువ..ఎమ్మెల్యేకు తక్కువ అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే పవన్ ఇచ్చిపడేశారు.

నా రక్తంలోనే సనాతన ధర్మం..

బలమైన దేశం కావాలంటే బలమైన ప్రజలు ఉండాలి. దేశం కోసం బలంగా నిలబడే యువత ఉంటేనే దేశం మారుతుంది. భవిష్యత్తును నిర్మించే యువ నాయకత్వం రావాలి. భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మం అనేది నా రక్తంలోనే ఉంది, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు

ఓజీ సినిమాకు వెళ్లి జనసేన జిందాబాద్ అనకూడదు. ఇక్కడకు వచ్చి ఓజీ అనకూడదు (అభిమానులు ఓజీ.. ఓజీ నినాదాలు చేసినప్పుడు) ఎందుకంటే జనసేన సిద్ధాంతాల కోసం 450  జనసైనికులు చనిపోయారు. వారి గౌరవం కోసం మాట్లాడకూడదు. నన్ను సినిమాల్లో చూసి ఓజీ అంటున్నారు. నేను సమాజం కోసం ఆలోచన చేసే ఇటువంటి వారిని చూస్తాను. దేశ భద్రత కోసం నేను ఎంతో ఆలోచిస్తాను. రిజిస్ట్రార్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన ఎదిగింది. ఇన్ని మాటలు మాట్లాడే ఇంగ్లీష్ పత్రికల వాళ్లు ఒకసారి ఆలోచన చేసుకోవాలి అని సున్నితంగానే విమర్శకులకు పవన్ చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తే రాష్ట్ర రాజకీయాల కంటే దేశ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రేప్పొద్దున టీడీపీని వదిలి బీజేపీతో జట్టుకట్టి ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చ్యపోనక్కర్లేదని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది.

Source link