న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించకూడదంటూ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సంచలన తీర్పు ఇచ్చింది. మహిళను తన ఆస్తిగా ఆమె భర్త భావించకూడదని, మహాభారత కాలం నాటి ఆలోచనలకు ఇప్పుడు కాలం చెల్లిందని జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు. ఓ వ్యక్తి తన భార్య అతడి ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని, చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన భర్తకు నిరాశే ఎదురైంది. వివాహిత ప్రియుడికి ఊరట కలిగిస్తూ, ఆమె భర్తకు హైకోర్టు షాకిచ్చింది. వివాహేతర (Adultery) సంబంధం నేరం కాదని పేర్కొంటూ ప్రియుడికి ఊరట కలిగించింది.
అసలేం జరిగిందంటే..
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉండటాన్ని గుర్తించాడు. భార్య హద్దులు మీరి ప్రవర్తిస్తోందని, తన ప్రియుడితో శారీరక సంబంధం కొనసాగించడం నేరమంటూ కోర్టును ఆశ్రయించాడు ఆమె భర్త. హోటల్ గదిలో తన భార్య ఆమె ప్రియుడితో శారీరకంగా కలిసిందని మహిళ భర్త ఆరోపించాడు. మొదట మేజిస్ట్రేట్ కోర్టు ప్రియుడిని దోషిగా చేయడం సరికాదని తీర్పునివ్వడంతో అతడికి ఊరట లభించింది. వివాహిత భర్త తరువాత సెషన్స్ కోర్టును ఆశ్రయించగా.. మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ప్రియుడికి నోటీసులు జారీ చేసింది.
తనకు అన్యాయం జరుగుతోందంటూ వివాహిత ప్రియుడు సెషన్స్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశాడు. ఒక స్త్రీని భర్త తన ఆస్తిగా చూడటం వల్ల వినాశకరమైన పరిణామాలు ఉంటాయని ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ పేర్కొన్నారు. మహాభారతంలోని ద్రౌపది ఎపిసోడ్ ద్వారా మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ద్రౌపదికి ఐదు మంది భర్తలున్నా.. ఆమె భర్తలలో ఒకరైన ధర్మరాజు ద్రౌపదిని జూదంలో పణంగా పెట్టాడు. ప్రశ్నించాల్సిన మిగిలిన నలుగురు సోదరులు మౌనంగా కూర్చుని ప్రేక్షకపాత్ర వహించారు. దాంతో భార్య అయిన ద్రౌపది ఆమె గౌరవం కోసం నిరసన తెలిపే అవకాశం రాలేదని ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 17న తీర్పులో ప్రస్తావించింది.
మహిళ మీద ఆడిన జూదం పెను ప్రమాదానికి దారితీసింది. దాని ఫలితంగా జరిగిన మహాభారత యుద్ధం సామూహిక ప్రాణనష్టానికి దారితీసింది. ఆ వంశాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కనుక భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 కింద ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగ విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ప్రస్తావించారు.
స్త్రీని ఒక ఆస్తిగా పరిగణించడం సరికాదని, మహాభారత కాలం నాటి ఆలోచనలు తగదని సూచించారు. వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన విషయమని, ఈ అంశాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా గుర్తుచేశారు. సుప్రీం కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని, మహిళ భర్త చేసిన ఫిర్యాదు కేసును రద్దు చేసే అవకాశం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు తీర్పును వివాహిత ప్రియుడు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా, అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో వివాహేతర సంబంధం తప్పు అని వాదిస్తున్న మహిళ భర్తకు షాక్ తగిలినట్లు అయింది. వివాహేతర సంబంధాలపై చర్యలు తీసుకునే అవకాశం లేదా అని ఆమె భర్త వాపోయాడు.
మరిన్ని చూడండి