A threat to Pawan Kalyan! పవన్‌ కల్యాణ్‌కు పొంచి ఉన్న ముప్పు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ముప్పు పొంచి ఉందా..? కొందరు ఆయన్ను ఏదో చేయాలని చూస్తున్నారా..? అంటే ఇది అక్షరాలా నిజమేనని చెప్పుకోవచ్చు. ఈ విషయాలు ఎవరో చెబితేనో.. పుకార్లో కాదండోయ్.. స్వయాన సేనానియే చెప్పుకొచ్చారు. దీంతో అసలేం జరుగుతోంది..? అంటూ కుటుంబ సభ్యులు, జనసేన శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇంతకీ పవన్ ఏం చెప్పారు..? పవన్‌కు ఏ రూపంలో ముప్పు పొంచి ఉంది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అసలేం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలవడమే లక్ష్యంగా తనవంతుగా ప్రయత్నం చేస్తున్నారు పవన్. అహర్నిశలు కష్టపడుతూ.. సీట్లు ఎక్కువ వచ్చినా రాకున్నా.. పార్టీలో అసంతృప్తులు ఉన్నప్పటికీ అన్నీ నచ్చజెప్పుకుని సర్దుకుంటూ ముందుకెళ్తున్నారు.  పార్టీలో ఏమున్నా.. ప్రత్యర్థులు ఏమన్నా సరే కూటమి గెలిచిన తర్వాత చూసుకుందాం అన్నట్లుగా బరిలోకి దిగిపోయారు. ఎన్నికల కదనరంగంలోకి దిగిన సేనాని.. తాను పోటీచేస్తున్న పిఠాపురం నుంచే వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే..  ప్రచారంలో, బస చేస్తున్న ప్రదేశంలో వేలాది మంది కార్యకర్తలు, నేతలు, సామాన్యులు కలుస్తుంటారు. దీంతో పవన్‌కు ఎందుకో సందేహం కలిగింది. సోమవారం నాడు జనసేనలో చేరికల కార్యక్రమంలో భాగంగా.. పవన్ సంచలన వ్యాఖ్యలే చేశారు. అభిమానులు, కార్యకర్తలు కలవడానికి ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతోందన్నారు. అయితే ఈ జనాల్లో కిరాయి మూకలు కూడా కలుస్తున్నాయి అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ కిరాయి వ్యక్తులు కనిపించకుండా సన్న సన్న బ్లేడ్లు తెచ్చి తనను కానీ.. తన సెక్యూరిటీని కానీ ఏదైనా చేస్తే పరిస్థితేంటని ఒకింత కంగారుపడుతూ మాట్లాడారు. అందుకే.. ఇకపై ప్రతిరోజు 200 మందికి మాత్రమే తనను కలిసే అవకాశం కల్పిస్తానని పవన్ తేల్చిచెప్పారు. అలా.. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితోనూ ఫొటోలు దిగుతానని మాటిచ్చారు. పిఠాపురంను స్వస్థలంగా చేసుకోవడానికే వచ్చానని మరోసారి సేనాని గుర్తు చేసుకున్నారు.

ఏమైనా జరగొచ్చు!

వాస్తవానికి.. ఎన్నికల ముందు ఏమైనా జరగొచ్చు. ఎవరికీ అనుమానం లేకుండా ప్రత్యర్థి పార్టీలే ఏదైనా చేయొచ్చు.. ఇందులో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా గుడ్డిగా వెళ్తే మాత్రం పరిస్థితి తారుమారవుతుందని.. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ నోట ఈ మాట వచ్చేసరికి కుటుంబ సభ్యులు, మోగాభిమానులు, జనసేన కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. ఇటీవలే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చినట్లుగానే.. పవన్‌కు కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. పవన్ వెంటనే.. రాష్ట్ర, కేంద్ర హోం శాఖలకు ఫిర్యాదు చేసి భద్రత విషయమై మాట్లాడాలని పార్టీ శ్రేణులు ఒత్తిడి తెస్తున్నాయని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ ఏ మాత్రం అలసత్వం వహించకుండా జాగ్రత్తగా.. ఏ పనిచేయాలన్నా ఆచితూచి చేస్తే ఎందుకైనా మంచిదేమో..!

Source link