టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ అభియోగాలు మోపింది. కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరింది. ఏపీ సీఐడీ తరపున రెండు పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేశామని సీఐడీ తరపు లాయర్ గతంలో వివేకానంద తెలిపారు. లింగమనేని రమేష్ ఇల్లు అటాచ్ మెంట్ పిటిషన్ ఒకటి కాగా, మాజీమంత్రి నారాయణ బంధువుల ఆస్తుల జప్తు పిటిషన్ మరొకటని కోర్టుకు వివరించారు. 1944 ఆర్డినెన్స్ ప్రకారం తన పిటిషన్‌పై ఆర్డర్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నేరం జరిగిందా లేదా అనేది తెలుసుకునేందుకు అవసరమైతే అఫిడవిట్ వేసిన అధికారిని కోర్టు విచారణ చేయవచ్చన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసు ఇచ్చే అవకాశం లేదని చెప్పినట్లు తెలిపారు. జప్తు ఉత్తర్వులు ఇవ్వటమా, నిరాకరించటమా అనేది ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్-1944 నిబంధన ప్రకారం అటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ముందే ప్రతివాదులకు నోటీసు ఇచ్చి వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయవాది సోము కృష్ణమూర్తి కోరారు. కోర్టులో దాఖలుచేసిన దస్త్రాలను ప్రతివాదులకు ఇవ్వాలని సీఐడీని ఆదేశిస్తూ మే 17న న్యాయస్థానం ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇప్పటివరకూ దస్త్రాలను తమకు అందజేయలేదని గత విచారణలో వాదనలు వినిపించారు.