Adani Announces Rs 50000 Crore Investment in Assam For Airports Roads Gas Transmission and Cement | Adani Group: అసోం కోసం ట్రెజరీ ఓపెన్‌ చేసిన అదానీ

Adani Group Investment in Assam: గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అసోం కోసం ఏకంగా రూ. 50,000 కోట్ల భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. ఇది, ఆ రాష్ట్రంలో ఒక బిజినెస్‌ గ్రూప్‌ పెట్టిన అత్యంత విలువైన పెట్టుబడుల్లో ఒకటి కావడం విశేషం. రెండు రోజుల బిజినెస్‌ సమ్మిట్‌  ‘అడ్వాంటేజ్ అసోం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025’ ‍‌(Advantage Assam 2.0 Investment & Infrastructure Summit 2025) మంగళవారం అసోంలోని గువాహతిలో ప్రారంభమైంది. సదస్సులో ప్రసంగించిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆ రాష్ట్రంలో రూ. 50 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించారు.

“ఇది కేవలం పెట్టుబడి కాదు, అసోం బంగారు భవిష్యత్తుకు పునాది వేయడానికి మేం తీసుకున్న ఒక సంకల్పం. ఈ అభివృద్ధి ప్రయాణంలో మేము భాగం కావడం గర్వంగా ఉంది. అసోం అభివృద్ధి వైపు గొప్పగా అడుగులు వేస్తోంది. అసోంతో కలిసి అదానీ గ్రూప్‌ కూడా ఆ మార్గంలో నడవడం గౌరవంగా భావిస్తున్నాం. ఇది మా నిబద్ధత, ఇది మా దార్శనికత, ఇది మేము ఈ రోజు అస్సాంకు చేస్తున్న వాగ్దానం. భవిష్యత్తును మనం కలిసి నిర్మిద్దాం”. – గౌతమ్ అదానీ

వివిధ రంగాల అభివృద్ధి కోసం రూ.50,000 కోట్లు
అదానీ గ్రూప్‌, ఈ 50,000 కోట్ల రూపాయల మెగా పెట్టుబడిని వివిధ రంగాల్లోకి చొప్పిస్తుంది. అసోంలో విమానాశ్రయాలు, ఏరో సిటీ, సిటీ గ్యాస్ పంపిణీ, ప్రసారాలు, సిమెంట్, రహదారి ప్రాజెక్టుల కోసం వినియోగిస్తుంది. పెట్టుబడిని మించి ఫలితాలు ఇచ్చేలా & అసోం ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేలా ఇది ఒక మాస్టర్ ప్లాన్‌ అవుతుందని గౌతమ్‌ అదానీ చెప్పారు.

అసోం యువతకు సువర్ణావకాశం
అదానీ గ్రూప్ చేసిన ఈ పెట్టుబడి అసోంలో వేలాది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని & మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంటే, ఇప్పుడు అసోం యువత ఉపాధిని వెతుక్కుంటూ బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు, సొంత ప్రాంతంలోనే పని దొరుకుతుంది. 

గుజరాత్ నుంచి ప్రేరణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెట్టుబడి విధానాన్ని గౌతమ్ అదానీ ప్రశంశించారు. “2003లో గుజరాత్‌లో ప్రారంభమైన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ మొత్తం దేశానికి పెట్టుబడి-ఆధారిత అభివృద్ధి శక్తిని అనుభవంలోకి తీసుకొచ్చింది. నేడు అసోం కూడా అదే దారిలో పయనిస్తోంది” అని చెప్పారు. ఇంకా, “బ్రహ్మపుత్ర నది తన సొంత మార్గాన్ని సృష్టించుకున్నట్లే, ప్రధాన మంత్రి మోదీ భారతదేశంలో ఆర్థిక అవకాశాల కొత్త మార్గాన్ని తెరిచారు” అని అదానీ అన్నారు.

‘అడ్వాంటేజ్ అసోం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025’లో మన దేశంతో పాటు వివిధ దేశాల నుంచి గ్లోబల్ పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు, వివిధ పరిశ్రమల్లోని ప్రముఖ బిజినెస్‌ లీడర్లు కూడా హాజరయ్యారు. అసోం మౌలిక సదుపాయాలు, విద్యుత్‌, సాంకేతికతల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఆ రాష్ట్ర ఆర్థిక సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ‘అడ్వాంటేజ్ అసోం 2.0’ లక్ష్యం.

‘బ్యాంబూ ఆర్కిడ్స్‌’ డిజైన్‌ ఆవిష్కరించిన ప్రధాని
అడ్వాంటేజ్ అసోం 2025 సమ్మిట్‌లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గువాహతిలోని ‘లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ (LGBIA) కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం (NITB) ‘బ్యాంబూ ఆర్కిడ్స్‌’ డిజైన్‌ను ఆవిష్కరించారు. అసోం సహజ సౌందర్యాన్ని ప్రేరణగా తీసుకుని రూపొందించిన ఈ డిజైన్ జీవ వైవిధ్యం, బలం, స్థిరత్వాన్ని సూచిస్తుంది.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న NITB, ఏడాదికి 13.1 మిలియన్ల ప్రయాణీకుల రద్దీని నిర్వహించగలదు. ఇది, ఈశాన్య ప్రాంతంలో, ఈ కేటగిరీలో మొట్టమొదటి విమానాశ్రయ టెర్మినల్‌గా నిలిచింది. ఇది 2025 చివరి త్రైమాసికం నుంచి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

మరో ఆసక్తికర కథనం: మహా శివరాత్రి సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవా, ట్రేడింగ్‌ జరుగుతుందా? 

మరిన్ని చూడండి

Source link