Agriculture 2024: దేశ రైతాంగం సమస్యలు వివరిస్తూ ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ(Gunturu Seshendra sharma) ఒక మాట అంటారు. “రైతు నాగలి మోస్తున్నాడు.. క్రీస్తు శిలువ మోసినట్టు` అని! ఇది నిజమే. ఏ సీజన్‌కు ఆ సీజన్‌లో రైతులు నష్టపోతూనే ఉన్నారన్నది జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు సైతం చెబుతున్న మాట. దీనికి కారణం.. ప్రకృతి విపత్తులు, సరైన విధానాలు అమలు కాకపోవడం.. రైతులకు సరైన దిశానిర్దేశం చేయకపోవడమే! ఈ కారణంగానే దేశంలోని వివిధ రంగాలతో పోల్చుకుంటే.. వ్యవసాయ రంగం దినదిన గండంగానే ముందుకు సాగుతోంది. అయితే.. ఇది ఒకప్పటి మాట.
కోటి మంది రైతులు నేచురల్ ఫార్మింగ్ !
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సాగు సమస్యలు పరిష్కరించేందుకు, రైతులకు దన్నుగా నిలిచేందుకు అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. రైతులు వ్యతిరేకించడంతో వ్యవసాయ చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం తెలిసిందే. రైతుల కష్టాన్ని వృధా కాకుండా చూడడంతోపాటు భారత దేశ వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కేలా చేస్తున్నారు. 2024వ సంవత్సరంలో అధునాతన సాంకేతిక వ్యవస్థను కూడా వ్యవసాయ రంగానికి జోడించడంతోపాటు.. సాగు పద్ధతులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే వ్యవస్థలను కూడా చేరువ చేశారు.
అదేవిధంగా ప్రకృతి ఉత్పాతాలను గుర్తించి ఎప్పటికప్పుడు రైతన్నను జాగు చేసేలా మండలానికో విపత్తు హెచ్చరికల వ్యవస్థను ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నారు. ఇక, ప్రతి సీజన్‌లోనూ పంటల మద్దతు ధరలను(MSP) పెంచుతున్నారు. ఆధునిక సాగు పద్ధతులను అవలంభిస్తూ.. అన్నదాతలకు దన్నుగా నిలుస్తున్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో కోటి మంది రైతులను నేచురల్ ఫార్మింగ్(natural farming) దిశగా నడిపించాలని కూడా కేంద్ర సర్కారు సంకల్పం చెప్పుకోవడం గమనార్హం.
సాగులోకి ఏఐ టెక్నాలజీ!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో ఏఐని వ్యవసాయరంగానికి కూడా జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తద్వారా ప్రకృతి విపత్తులపై రైతులను ముందుగానే అప్రమత్తం చేయడం.. ఏ కాలానికి తగిన విధంగా ఆ పంటలను సాగు చేయడం.. సాగు నీటి సమస్యలు ఉన్న భూములను ముందుగానే గుర్తించడం సహా.. ఎరువులు, చీడపీడలు రాకుండా వేసే పురుగు మందులు వంటి విషయాల్లోనూ, మృత్తికా పరీక్షల(Soil Test) అంశాల్లోనూ ఏఐ సాంకేతికతను వినియోగించనున్నారు.
Also Read: Jagan Mohan Reddy Tour: శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర
వ్యవసాయ రంగంలో డ్రోన్లను ప్రవేశ పెట్టడం ఈ ఏడాది చోటు చేసుకున్న అద్బుత ప్రయత్నమనే చెప్పాలి. డ్రోన్ల ద్వారా ఎరువులు పురుగు మందులను నేరుగా వ్యవసాయ క్షేత్రాలకు తరలిస్తారు. అదేవిధంగా పురుగు మందుల పిచికారీ నుంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డ్రోన్ల సేవలను వినియోగిస్తున్నారు. ఈ విధానం ఇప్పటికే పంజాబ్, హర్యాణా వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. త్వరలోనే దీనిని ఆంధ్రప్రదేశ్‌లోనూ తీసుకురానున్నారు. ఈ డ్రోన్ల(Drone) వినియోగానికి డ్వాక్రా సంఘాలను వినియోగించడం మరో అద్భుత విషయమనే చెప్పాలి.
మద్దతు ధరలు
కేంద్రం పెద్దలు పంటలకు మద్దతు ధరలు పెంచే విషయంలో ప్రతి సీజన్‌లోనూ నిర్ణయం తీసుకుంటున్నారు. గతంలో ఏడాదికి ఒక్కసారే ఈ నిర్ణయం తీసుకునే విధానం ఉండగా.. ఇప్పుడు ఖరీఫ్, రబీ సీజన్ల ప్రారంభంలో ఆయా పంటల సాగును బట్టి ధరలను అంచనా వేసి.. మద్దతు ధరలు ప్రకటిస్తున్నారు. అదే సమయంలో రవాణా, గోదాముల పరిస్తితిని మెరుగు పరిచే విషయంపై ఈ ఏడాది ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రకటించడం గమనార్హం. దేశవ్యాప్తంగా గోదాముల సంఖ్యను 2 లక్షల వరకు పెంచాలని నిర్ణయించారు. ప్రకృతి విపత్తులు తట్టుకుని నిలిచే వంగడాలకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నారు. పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిలో కూడా ఏఐని విస్తరించడం ద్వారా.. రైతులకు మేలు చేయనున్నారన్నది సుస్పష్టం. ఇవన్నీ.. ఈ ఏడాది చోటు చేసుకున్న పరిణామాలే. అదేవిధంగా ఏటా మూడు సార్లు ఇస్తున్న పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojana) నిధులను కూడా క్రమం తప్పకుండా విడుదల చేయడం అన్నదాతలకు మేలు చేస్తున్న మరో విధానమనే చెప్పాలి.
అయినా సవాళ్లు!
వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతుగా నిలిచి అనేక ఆవిష్కరణలకు ప్రోత్సాహకా లకు అవకాశం ఇస్తున్నా.. దళారీ వ్యవస్థ, సరైన మార్కెటింగ్ లేక పోవడం.. వ్యవసాయ కూలీల తగ్గుదలవంటివి సాగు రంగానికి సమస్యలుగా పరిణమిస్తున్నాయి. వీటికితోడు విత్తనాల ధరలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి ధరలు పెరుగుతుండడం రైతులకు కష్టంగానే మారిందని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి తరచుగా కనిపిస్తోంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరలకు (MSP) `చట్టబద్ధత` లేక పోవడం కీలక సమస్య. దీనిపైనే ప్రస్తుతం రైతులు ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.
కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరలు (MSP) బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసే యంత్రాంగాలు ఉన్నా.. మోసాలు మాత్రం తప్పడం లేదు. ఏదో ఒక కారణంగా మద్దతు ధరలను ఇవ్వకుండా పీడిస్తున్న శక్తులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలన్నది రైతులు కోరుతున్న ప్రధాన డిమాండ్. అదేవిధంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ( MGNREGA) పథకాన్ని వ్యవసాయ రంగానికి కూడా వర్తింప చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. తద్వారా కూలీలపై తాము పెట్టే ఖర్చులు తగ్గుతాయన్నది అన్నదాతల మాట. ఇక, తమ పంటలకు 50 శాతం లబ్ధి(50% profit) చేకూరేలా ప్రభుత్వాలు గ్యారెంటీ ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది.
పెట్టుబడులు పెట్టి మూడు కాలాల పాటు కంటికి రెప్పలా కాచుకున్నా.. ఎంత ఆదాయం వస్తుందో చెప్పలేనిరంగంగా సాగు రంగం ఉండడంతోనే ఈ డిమాండ్ వినిపిస్తోంది. ఇక, 60 ఏళ్ల వయసు దాటిన రైతులకు 10 వేల రూపాయల చొప్పున పింఛను ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా రైతాంగానికి ప్రోత్సహం మాత్రం అందించేందుకు 2024లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దోహదపడతాయనే చెప్పాలి. ఏఐ( artificial intelligence) ద్వారా తోడ్పాటు, బ్లాక్ చైన్ విచ్చిన్నం వంటివి కూడా రైతులకు మేలు చేయనున్నాయి.
రెండు కీలక పథకాలు..
ఈ ఏడాది ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌లో రెండు కీలక పథకాలను ప్రకటించడం రైతులకు సంతోషాన్ని ఇచ్చింది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(PM-RKVY), ప్రధాన మంత్రి కృష్ణోన్నతి యోజన(PM KY)లు రైతులకు మేలు చేసేవేనని చెప్పవచ్చు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఇన్ పుట్ సబ్సిడీ(Input subsidy)ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో 6 వేల కోట్ల రూపాయల వరకు కేటాయించడం గమనార్హం. అదేవిధంగా వ్యవసాయ రంగంలో డ్రోన్లను అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం సన్నద్ధమైంది. మొత్తంగా చూస్తే.. 2024లో సాగు రంగానికి ప్రాధాన్యం దక్కిందనే చెప్పాలి.
మరిన్ని చూడండి