Air India Gets Aviation Ministry Notice Over 20 Hour Flight Delay

Air India Gets Show Cause Notice: ఎయిర్ ఇండియాకి ఏవియేషన్ మినిస్ట్రీ నోటీసులు (Air India) ఇచ్చింది. ఢిల్లీ శాన్‌ఫ్రాన్సిస్కో ఫ్లైట్‌ దాదాపు 20 గంటల పాటు ఆలస్యం అవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. అన్ని గంటల పాటు ప్యాసింజర్స్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొంత మంది కారిడార్‌లో వేచి చూశారు. ఫ్లైట్‌లో ఏసీ లేకపోవడం వల్ల కొంత మంది నీరసించిపోయి కళ్లు తిరిగి పడిపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ Air India కి నోటీసులు పంపింది. ఆపరేషనల్ రీజన్స్ వల్ల ఫ్లైట్ ఆలస్యమైందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఆ సమస్యని పరిష్కరించినట్టు వెల్లడించింది. కానీ…విమర్శలు మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే ఏవియేషన్ శాఖ తీవ్రంగా మందలించింది. తగిన సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. ఢిల్లీలో 50 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి తెలిసి కూడా ఏసీ లేకుండా ఫ్లైట్‌ని ఎలా నడిపారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

“ఎయిర్ ఇండియా ఫ్లైట్స్‌ డిలే అవుతున్నాయని DGCA దృష్టికి వచ్చింది. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పుడే కాదు. తరచూ ఎయిర్‌ ఇండియాలో ఇదే సమస్య వస్తోంది. ఎందుకిలా జరుగుతోందో ఎయిర్ ఇండియా వివరణ ఇవ్వాలి. అందుకో షో కాజ్ నోటీసులు ఇస్తున్నాం. ఇన్ని సార్లు ఇబ్బందులు వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వివరించాలి. మూడు రోజుల్లోగా ఈ క్లారిటీ ఇవ్వాలి”

– పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ 

డిలే అయిన Boeing 777 లో దాదాపు 200 మంది ప్రయాణికులున్నారు. మే 30వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు ఫ్లైట్ టేకాఫ్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల డిలే అయింది. దాదాపు ఆరు గంటల తరవాత ఫ్లైట్‌ని రీషెడ్యూల్ చేశారు. అప్పుడైనా అంతా బానే ఉందా అంటే అదీ లేదు. టెక్నికల్ గ్లిచ్ ఉందని చెప్పి వేరే ఫ్లైట్‌లోకి వెళ్లాలని ప్యాసింజర్స్‌ని కోరింది ఎయిర్ ఇండియా. మారిన ఆ ఫ్లైట్‌లో ఏసీ పని చేయలేదు. ఉక్కపోతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహిళలు, చిన్నారులు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. ఓ గంట పాటు అందులోనే కూర్చున్నారు. తట్టుకోలేక అంతా బయటకు వచ్చారు. ఆ తరవాత కూడా మళ్లీ గంటల కొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. ఇలా ప్రయాణికులంతా నరకం చూశారు. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడం ప్రయాణికులని అసౌకర్యానికి గురి చేస్తోంది. ఎన్ని సార్లు ప్యాసింజర్స్ కంప్లెయింట్ ఇస్తున్నా పట్టించుకోకపోవడం నిర్లక్ష్యమే అని DGCA తేల్చి చెబుతోంది. దీనిపై వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సోషల్ మీడియాలోనూ ఎయిర్ ఇండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. మెయింటేన్ చేయలేనప్పుడు ఫ్లైట్స్‌ ఎందుకు షెడ్యూల్ చేస్తున్నారని నెటిజన్లు మండి పడుతున్నారు. 

Also Read: Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్‌హోస్టెస్, కడుపులో కిలో బంగారం

మరిన్ని చూడండి

Source link