Supreme Court: సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా తమ ఆస్తులను సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో బహిరంగంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయంగా ఫుల్ కోర్టు అంటే… సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా సమావేశం కావడం. కేసుల విచారణ.. ఇతర అంశాలపై చర్చిస్తారు. ఇలాంటి ఫుల్ కోర్టు సమావేశంలో ఆస్తులన్నీ ప్రజల ముందు ఉంచాలన్న ప్రతిపాదనకు అందరూ అంగీకారం తెలిపారు. ఇప్పటి వరకూ ఉన్న నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులు కాగానే ఆస్తుల వివరాలను చీఫ్ జస్టిస్ కు సమర్పించాల్సి ఉంటుంది. ఆ వివరాలు రికార్డుల్లో ఉంటాయి. కానీ పబ్లిక్ కు అందుబాటులో ఉంచలేదు. ఇప్పుడు మాత్రం న్యాయమూర్తుల ఆస్తులు పబ్లిక్ గా ఉంటాయి.
జస్టిస్ యశ్వంత్ శర్మ నివాసంలో బయట పడిన నోట్ల కట్టలు
ఇటీవల ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ క్రమంలో మరింత పారదర్శకత అవసరం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భావించినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు న్యాయూర్తులను ఆదర్శంగా తీసుకుని హైకోర్టు జడ్జిలు.. అలాగే ఇతర కోర్టుల న్యాయమూర్తులు కూడా .. తమ తమ ఆస్తుల వివరాలను బహిరంగ పరుస్తారని భావిస్తున్నారు.
న్యాయవ్యవస్థలో మరింత పారదర్శకత కోసం ప్రయత్నాలు
మార్చి 14న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడే ఆయన ఇంట్లో నుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంత వరకూ కాలిపోయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటు చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మకు కొంతకాలం పాటు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలను అప్పగించకూడదని కూడా నిర్ణయించారు.జస్టిస్ యశ్వంత్ వర్మ 2014 అక్టోబర్ లో అలాహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలహాబాద్ హైకోర్టులో జడ్జీగా ఏడేళ్లు పనిచేసిన తర్వాత, 2021 అక్టోబర్ 11న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన చాలా కీలక తీర్పులు ఇచ్చారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిర్ణయం -అన్ని విభాగాల్లోని న్యాయమూర్తులూ పాటిస్తారా ?
అయితే ఆయన తన ఇంట్లో దొరికిన తన డబ్బు తనది కాదని అంటున్నారు. ఈ ఘటన బయటపడిన తర్వాత న్యాయవ్యవస్థలో జవాబుదారీదనం పై చర్చ పెరిగింది. ఈ క్రమంలో న్యాయవ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వసనీయత పెరిగేలా చేయడానికి కొన్ని సంస్కరణలు అవసరమని చాలా మంది మీడియాలో.. సోషల్ మీడియాలో మాట్లాడటం ప్రారంభిచారు. న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థపైనా చర్చ జరుగుతోంది.
మరిన్ని చూడండి