Residential Property Price HIke In Hyderabad: హైదారాబాద్‌లో ఇళ్ల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు, కనీసం స్థిరంగా ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ అనరాక్ (Anarock) తాజా రిపోర్ట్ ప్రకారం, హైదరాబాద్ మహా నగరంలో ఇళ్ల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. 2021 నుంచి 2024 మధ్య కాలంలో, అంటే కేవలం నాలుగేళ్లలో భాగ్యనగరంలో హౌసింగ్ ప్రైజెస్ రెట్టింపు పైగా, 128% పెరిగాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), దిల్లీ NCRలో హౌసింగ్ ప్రాపర్టీ రేట్లు కూడా ఇదే తరహాలో జంప్ చేశాయి, కొనుగోలుదార్లకు చుక్కలు చూపించాయి. దేశంలోని 7 ప్రధాన నగరాలు – దిల్లీ NCR, ముంబై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలో స్థిరాస్తి పరిస్థితులను అన్‌రాక్ విశ్లేషించి, తాజా నివేదిక విడుదల చేసింది.
విశేషం ఏంటంటే… 2021 నుంచి 2024 మధ్య కాలంలో, హైదరాబాద్, బెంగళూరు (Bangalore), ముంబయి (Mumbai), దిల్లీ ఎన్‌సీఆర్ (Delhi NCR)లో ఇంటి అద్దెల్లో వచ్చిన పెరుగుదలతో పోలిస్తే, ఇళ్ల ధరలు అధికంగా పెరిగాయి. దీనికి రివర్స్‌లో… పుణె (Pune), కోల్‌కతా (Kolkata), చెన్నై (Chennai) సిటీల్లో ఇళ్ల ధరల్లో వచ్చిన పెరుగుదల కంటే అద్దెల్లో వచ్చిన పెరుగుదల ఎక్కువగా ఉందని అనరాక్ రిపోర్ట్ పేర్కొంది.
హైదరాబాద్‌లో రేట్ల పెరుగుదల తీరు ఇదీ..
భాగ్యనగరంలో, ముఖ్యంగా ఐటీ జోన్‌లోనే ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 2021 నుంచి 2024 మధ్య కాలంలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో ఇంటి రెంట్‌ల కంటే ఇంటి రేట్లు ఎక్కువగా పెరిగినట్లు అనరాక్ రిపోర్ట్ స్పష్టం చేసింది. హైటెక్ సిటీలో హౌసింగ్ ప్రైజెస్‌లో 62% వృద్ధి కనిపించగా, అద్దెల్లో వృద్ధి 54 శాతంగా ఉంది. గచ్చిబౌలి విషయానికి వస్తే.. ఈ ప్రాంతంలో ఇంటి రేట్లు 78% పెరిగితే, అద్దెలు 62% పెరిగాయి.
నోయిడాలో గరిష్టంగా 128% జంప్
2021 నుంచి 2024 మధ్య కాలంలో, దిల్లీ NCRలో పరిధిలో ఉన్న నోయిడాలో నివాస ఆస్తుల ధరలు అత్యంత వేగంగా పెరిగాయి. నోయిడా సెక్టార్ 150లో, ఆ నాలుగేళ్లలో ఇళ్ల ధరలు సగటున 128% పెరిగాయి, అద్దె విలువలు 66 శాతం పెరిగినట్లు అనరాక్ నివేదికలో ఉంది. నోయిడా సెక్టార్ 150లో, ఇళ్ల సగటు ధర చదరపు అడుగుకు రూ. 5,700 నుంచి రూ.13,000 కు చేరి, రెట్టింపు పైగా పెరిగింది. అదే కాలంలో ఇంటి అద్దె 66 శాతం పెరిగి, నెల రూ. 16,000 నుంచి రూ. 26,600కు చేరుకుంది.
ఇంటి అద్దెల కంటే ఇంటి ధరలు ఎక్కువగా పెగడానికి ప్రధాన కారణం పెట్టుబడిదారుల్లో విశ్వాసం & అద్దె ఆదాయం కన్నా లగ్జరీ, హై-ఎండ్ అసెట్స్‌లోని పెట్టుబడులపై అధిక రాబడి రావడమేనని అన్‌రాక్ రిపోర్ట్ విశ్లేషించింది.
ఇంటి విలువ పెరగాలని కోరుకునేవాళ్లు హైదరాబాద్, నోయిడా, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ ప్రాంతాలను పరిశీలించాలని అన్‌రాక్ రిపోర్ట్ తెలిపింది. అద్దెలు ఎక్కువగా పెరగాలని ఆశించే పెట్టుబడిదార్లు పుణె, కోల్‌కతా, చెన్నై వంటి ప్రాంతాలు అనుకూలమని వెల్లడించింది.