బాహుబలి మనోహరిగా తెలుగు వారి గుండెల్లో కొలువుదీరి ఉంది నోరా ఫతేహి. మనోహరి.. గీతంలో అద్భుతమైన నర్తకిగా నిరూపించిన నోరా ఆ తర్వాతా టాలీవుడ్‌లో పలు ఐటమ్ నంబర్లలో మెరిసింది. ప్రస్తుతం ఉత్తరాది దక్షిణాది చిత్రాలతో బిజీగా ఉన్న నోరా బుల్లితెర రియాలిటీ షోల జడ్జిగాను అలరిస్తోంది. నోరా ప్రస్తుతం కాంచన4లో నటిస్తోంది. రాఘవ లారెన్స్ కాంచన ఫ్రాంఛైజీలో ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
దే జోష్‌లో నోరా ఫతేహి మరో జాక్ పాట్ కొట్టిందని తెలిసింది. ఈ భామ దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్న పాన్ ఇండియన్ చిత్రం క్రిష్ 4లో నటించనుందని తెలుస్తోంది. హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తూ ఫ్రాంచైజీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని ఇదివరకూ రాకేష్ రోషన్ ప్రకటించారు. హృతిక్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా, ప్రియాంక చోప్రా స్పందన అందరి దృష్టిని ఆకర్షించింది. నాల్గవ భాగంలోను ప్రియాంక చోప్రా నటించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే ఐఎండిబి వివరాల ప్రకారం.. క్రిష్ 4 లో నోరా ఫతేహి అవకాశం అందుకుంది. తన పాత్ర పరిధి ఎలాంటిది? అనే దానిపై ఎలాంటి స్పష్ఠతా లేదు కానీ, నోరా సహా కాస్టింగ్ గురించి మరింత స్పష్ఠత రావాల్సి ఉంది.
ఐఎండిబి తాజా లీకుల ప్రకారం.. క్రిష్ 4 కథాంశం టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని కూడా తెలుస్తోంది. దీని ప్రకారం క్రిష్ కు ఒక పురాతన కళాఖండం దొరుకుతుంది. ఆ కళాఖండం అతడిని భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోకి ప్రయాణించే గొప్ప శక్తిని ఇస్తుంది. చరిత్రను తిరగరాయడానికి, భవిష్యత్‌ను రీడిఫైన్ చేయడానికి.. దుష్టశక్తి నుంచి మానవాళిని కాపాడటానికి క్రిష్ వేర్వేరు యుగాలలో సంచరిస్తాడు. భారీ యాక్షన్ అడ్వెంచర్స్ కి ఆస్కారం ఉన్న స్క్రిప్టు ఇదని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో పాటు నోరా ఫతేహి, ప్రీతి జింటా, వివేక్ ఒబెరాయ్, నసీరుద్దీన్ షా, రేఖ నటిస్తారని కథనాలొస్తున్నాయి. ప్రియాంక చోప్రా తిరిగి ఫ్రాంఛైజీలో చేరుతుందా లేదా? అనేదానిపై ఇంకా స్పష్ఠత రావాల్సి ఉంది. హృతిక్ – ప్రీతి జింతా తిరిగి టైమ్ ట్రావెల్ లో కలిసి కనిపించే వీలుందని కూడా గుసగుస వినిపిస్తోంది. ప్రీతి జింతా ఇంతకుముందు హృతిక్ తో కోయి మిల్ గయాలో నటించిన సంగతి తెలిసిందే. క్రిష్ ఫ్రాంఛైజీ ఆరంభానికి కోయి మిల్ గయా పునాది. హృతిక్ రోషన్ క్రిష్ 4 కి దర్శకత్వం వహిస్తుండగా, దీనిని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లో ఆదిత్య చోప్రా నిర్మిస్తారు. కాస్టింగ్ ఎంపికల గురించి చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.