Barrier-less Toll Galre System To Be Rolled Out Soon India Centre Aims To Reduce Waiting Time At Plazas | Barrier Less Toll: త్వరలోనే కొత్త టోల్ సిస్టమ్

Barrier Less Toll: దేశంలోని జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల వద్ద త్వరలో సరికొత్త కొత్త టోల్‌ వ్యవస్థను అమలు చేయనున్నట్టు కేంద్ర రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రహదారులపై ఓపెన్‌ టోల్‌ సిస్టమ్‌ అమలును ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. కిలోమీటర్ల ఆధారంగా చెల్లింపులు చేయొచ్చని తెలిపారు. ఇది విజయవంతం అయితే వెంటనే అమల్లోకి తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రయాణికులు ఇకపై టోల్‌ ప్లాజాల వద్ద వెయిట్ చేయల్సిన అవసరం ఉండదని చెప్పారు. 

గతంలో నగదు చెల్లింపులతో చాలా సమయం వృథా అయ్యేదని, ఫలితంగా వాహనాలు కిలోమీటర్ల మేరకు వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. దాని స్థానంలో ఫాస్టాగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండే సమయాన్ని కేవలం 47 సెకన్లకు తగ్గించగలిగామన్నారు. భవిష్యత్తులో ఆ సమయాన్ని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్‌ వ్యవస్థను ప్రస్తుతం ఢిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో పైలట్‌ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 

వాహనాలు జాతీయ రహదారిపైకి ప్రవేశించినప్పుడు టోల్‌ ప్లాజా వద్ద రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ను కెమెరా స్కాన్‌ చేసి డేటాను క్రోడీకరిస్తుందని ప్రయాణించిన కిలోమీటర్లకు ఛార్జీలు విధిస్తుందని మంత్రి చెప్పారు. టెలికాంతో పాటు అన్ని రంగాల్లో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఇలాంటి సాంకేతిక పురోగతి సాధ్యమవుతోందని మంత్రి పేర్కొన్నారు. టెలి కమ్యూనికేషన్స్‌ రంగం అన్ని ఇతర రంగాలతో అనుసంధానమై ఉందన్నారు.

గతంలోనే చెప్పిన గట్కరీ
ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో సీసీఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ఇదే అంశంపై మాట్లాడారు. జాతీయ రహదారులపై టోల్‌ ఫీజు వసూలుకు జీపీఎస్‌- ఆధారిత వ్యవస్థను ఆరు నెలల్లో తీసుకొస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న టోల్‌ ప్లాజాల స్థానంలో వాటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనివల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులను తప్పడంతో పాటు, ప్రయాణించిన దూరానికే ఫీజు వసూలు చేయడం వీలుపడుతుందని చెప్పారు.  ప్రస్తుతం టోల్‌ ఫీజు వసూళ్ల ద్వారా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)కు ఏటా రూ.40 వేల కోట్లు ఆదాయం వస్తోందని, రాబోయే రెండు మూడేళ్లలో ఆదాయం రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని గడ్కరీ అన్నారు. 2018-19 నాటికి టోల్‌ ప్లాజాల వద్ద ఒక్కో వాహనం సగటున 8 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చేదని, ఫాస్టాగ్‌ అమల్లోకి వచ్చాక ఆ సమయం సగటున 47 సెకన్లకు తగ్గిందని మంత్రి వివరించారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Source link