Bengaluru man pays Rs 1.6 lakh fine for 311 traffic violation cases | Viral News: ఫైన్‌తో కొత్తదే కొనేయొచ్చేమో- 311 కేసులతో రికార్డ్

Traffic Violation Case : బెంగళూరులో ఓ విస్తుపోయే సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా వాహనాలపై 1, 2 లేదా అంతమించి అంటే 10 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు (Traffic violation cases) నమోదు కావడం చూస్తూనే ఉంటాం. కానీ ఓ స్కూటర్‌పై ఏకంకా 311 కేసులు ఫైల్ అయ్యాయి. అంతే కాదు రూ.1.6 లక్షల జరిమానా కూడా ఉంది. దీంతో పోలీసులు ఈ స్కూటర్ ను సీజ్ చేశారు. ఫైనల్ గా ఆ వాహన యజమాని ఫైన్ చెల్లించి, తన వెహికిల్ ను తీసుకుపోవడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

బెంగళూరులోని కలాసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియాస్వామి అనే వ్యక్తి ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తున్నాడు. గత కొంత కాలంగా అతని స్కూటర్ పై రికార్డ్ లెవల్లో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రయాణం చేస్తున్నప్పుడు మొబైల్ వాడడం, సిగ్నల్ జంప్, హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణించడం వంటి పలు విషయాలను సాక్ష్యంగా చూపుతూ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అలా కేసులున్నప్పటికీ అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదని, ఆ స్కూటర్ ను సీజ్ చేయడాన్ని గమనించిన ఓ స్థానికుడు.. ఆ బైక్ ను ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వదిలాడు. ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలకు సంబంధించిన స్క్రీన్ షాట్ లను సైతం పోస్ట్ లో పెట్టాడు. ఇంకేముంది.. ఆ పోస్ట్ కాస్తా వైరల్ అయి.. చివరికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను చేరింది.

పోస్ట్ ను గమనించిన పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులపై విచారించగా.. ఆ స్కూటర్ పై మొత్తం 311 కేసులు నమోదైనట్టు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. మరో విస్తుపోయే అంశమేమిటంటే.. ఆ చలానాలన్నింటినీ ఒక దగ్గర చేరిస్తే.. మొత్తం 20 మీటర్ల పొడవు ఉంటుంది పోలీసులు తెలిపారు. ఈ స్కూటర్ పై సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీసులు మొత్త రూ.1,61,500 ఫైన్ విధించారు. ఆ తర్వాత వాహనాన్ని సీజ్ చేశారు. ఇక చేసేదేం లేక యజమాని ఆ మరుసటి రోజే వచ్చి మొత్తం చలానా చెల్లించి, స్కూటర్ ను తీసుకుని వెళ్లాడు. ఇప్పట్నుంచైనా ట్రాఫిక్ నిబంధనలు సరిగ్గా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు (Traffic police) అతనికి వివరించి, పంపించారు. 

ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పలు రకాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైన్ తో కొత్తదే కొనేయొచ్చు కదా అని సలహా ఇచ్చారు. ఇది అతని లక్కీ బైక్ కావచ్చు అని కొందరు చమత్కరించారు. ఇన్ని కేసులు ఫైల్ అయినా ఇన్నాళ్లు పోలీసులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటూ ఇంకొందరు ప్రశ్నలు సంధించారు. అంతకుముందు ఇదే బెంగళూరులో 2023లో ఓ స్కూటర్ పైనా 634 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు కావడం రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో పాటు రూ.3.25 లక్షల జరిమానా కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆ వాహనాన్ని సీజ్ చేయడం గమనార్హం.

Also Read : Rahul Gandhi: దేశానికి సంబంధించినవే కాదు కాంగ్రెస్ కార్యక్రమాలకూ రాహుల్ డుమ్మా – నాయకత్వ సామర్థ్యం ఇంతేనా ?

మరిన్ని చూడండి

Source link