Big Jhalak to YSRCP వైసీపీకి ఎంపీల ఝలక్..

సొంత చెల్లెలు షర్మిలను ఎలా ఎదుర్కోవాలి? అనేది తెలియక నానా తంటాలు పడుతుంటే.. టీడీపీ, జనసేనల పొత్తుతోనే తలపట్టుకుంటే.. బీజేపీ కూడా వచ్చి పొత్తులో చేరుతానంటోంది. ఈ వ్యవహారాలన్నీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గోటి చుట్టుపై రోకలి పోటు మాదిరిగా మారాయి. తాజాగా వైసీపీ నేతలు జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు టీడీపీ అధినేత చంద్రబాబుకు టచ్‌లోకి వెళ్లారు. అసలే ఎమ్మెల్యేలు ఎంత మంది గట్టు దాటుతారో తెలియకుండా ఉంది. ఇప్పటికే కొందరు ఎంపీలు గట్టు దాటేశారు. 

చంద్రబాబుతో ప్రభాకర్ రెడ్డి భేటీ..

ఈ క్రమంలోనే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు టచ్‌లోకి వెళ్లడం జగన్‌కు ఇబ్బందికరంగా మారింది. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబుతో ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. అలాగే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి సైతం టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. వైసీపీకి ఆర్థికంగా అండదండలు ఇస్తున్న వారిలో ప్రభాకర్ రెడ్డి ఒకరు. వివాద రహితుడు.. ఏ విషయమైనా హూందాగా డీల్ చేస్తారని ఈయనకు పేరుంది. 

వైసీపీకి గుడ్ బై చెప్పనున్న ఆదాల, మాగుంట..

ఈసారి నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని ప్రభాకర్ రెడ్డికే జగన్ కేటాయించారు. కానీ అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో జగన్‌తో విభేదించారు. కొందరిని మార్చాలంటూ సూచనలు చేశారు. కానీ జగన్ అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఇక ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. ఆమె కూడా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభాకర్ రెడ్డితో పాటు ఆదాల, మాగుంట త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. ఎంపీ సీట్లు ఇస్తున్నా కూడా వద్దనుకుని వెళ్లిపోవడంపై వైసీపీలో అంతర్మథనం ప్రారంభమైంది. ఇప్పటికే జగన్‌తో విభేదించి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. అలాగే 10 మంది మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. మొత్తానికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ పెద్ద దెబ్బే తినడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Source link