ICAI Final Exams: దేశంలోని ఛార్టెడ్ అకౌంటెంట్(సీఏ) ఫైనల్ విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) గుడ్ న్యూస్ తెలిపింది. ఇక ఏడాదిలో మూడుసార్లు సీఏ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈ మేరకు ప్రకటించింది. ప్రస్తుతం ఏడాదికి రెండుసార్లు సీఏ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి మూడుసార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు గురువారం (మార్చి 28న) ప్రకటించింది.
ఇప్పటికే సీఏ ఇంటర్మీడియట్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహించాలని గతేడాది నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి సీఏ ఫైనల్ పరీక్షలను కూడా ఏడాదికి మూడుసార్లు నిర్వహించాలని ఐసీఏఐ నిర్ణయించింది. దీంతో సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ అనే మూడు స్థాయిలు ప్రతి సంవత్సరం సమానంగా మూడు అవకాశాలు కల్పిస్తాయని ఐసీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.
మూడు పరీక్షలు ఎప్పుడంటే?
సీఏ ఫైనల్ పరీక్షలను ప్రతి ఏడాది జనవరి, మే, సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. అయితే ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్‌లో పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సులో కూడా మార్పులు చేసినట్లు ఐసీఏఐ పేర్కొంది. అదేవిధంగా గతంలో రెండుసార్లు జరిగే అసెస్‌మెంట్ టెస్టు ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లో మూడుసార్లు జరుగుతాయని ఐసీఏఐ తెలిపింది.
సీఏ ఫైనల్ పరీక్షలు ఇలా..
సీఏ ఫైనల్ పరీక్షలకు సంబంధించి.. పరీక్షల్లో రెండు గ్రూపులు (గ్రూప్-1, గ్రూప్-2) ఉంటాయి. రెండు గ్రూపులో కలిపి మొత్తం 6 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో గ్రూపులో మూడు పేపర్లు ఉంటాయి. గ్రూప్-1లో పేపర్-1 ఫైనాన్షియల్ రిపోర్టింగ్, పేపర్-2 స్ట్రాటిజక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, పేపర్-3 అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్, అస్యూరెన్స్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి. ఇక గ్రూప్-2లోనూ మూడు పేపర్లు ఉంటాయి. పేపర్-4 డైరెక్ట్ ట్యాక్స్ లా & ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, పేపర్-5 ఇండైరెక్ట్ ట్యాక్స్ లా, పేపర్-6 ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సొల్యూషన్స్ పేపర్లు ఉంటాయి.
సీఏ ఫైనల్‌లో ఒక్కో పేపర్ 100 మార్కులకు మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థి వీలునుబట్టి 8 పేపర్లు ఒకేసారి లేదా ఒక్కో గ్రూపు విడివిడిగా రాసే వెసులుబాటు ఉంది. విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తం 50 శాతం మార్కులను సాధించాల్సి ఉంటుంది. గ్రూపు-2లో 6వ పేపర్‌ను ఎలక్టివ్ పేపర్‌గా నిర్ణయించారు. ఈ పేపర్‌లో భాగంగా విద్యార్థి 6 సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్టుని ఎంచుకొని చదవవచ్చు.
సీఏ కోర్సు చదవడానికి ఎవరు అర్హులు?
సీఏ చదవాలంటే ఒకప్పుడు డిగ్రీ తర్వాత గానీ సీఏ కోర్సులోకి ప్రవేశించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్ తర్వాతనే సీఏ కోర్సు చదవడం ప్రారంభించవచ్చు. ఇంటర్ ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఇలా ఏ గ్రూప్ వారైనా సీఏ కోర్సు చదవచ్చు. అయితే సీఏ చేయాలనుకునే చాలామంది విద్యార్థులు ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపుతోపాటే సీఏ కూడా ఏకకాలంలో చదవడానికే ఇష్టపడుతున్నారు.
సీఏతో ప్రయోజనాలివే..
దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన సీఏలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్లుగా, ఫైనాన్స్ కంట్రోలర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్, ప్లాంట్ అకౌంటెంట్స్, సిస్టమ్ ఇంప్లిమెంటర్స్, టెక్నో ఫంక్షనిస్టులుగా అవకాశాలు పొందవచ్చు. అంతేగాకుండా ట్రస్టీగా, అడ్మినిస్ట్రేటర్‌గా, వాల్యూయర్‌గా, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా, ట్యాక్స్ కన్సల్టెంట్లుగా ఉద్యోగాలు లభిస్తాయి.
మరిన్ని చూడండి