CBIC has clarified on GST rate changes regarding various goods and services are premature and speculative In Telugu | Tax Rate Hike: తూచ్‌, అవన్నీ ఊహాగానాలే

GST Rate Hike Reports Speculative CBIC : దుస్తులు, గడియారాలు, సిగరెట్లు, పొగాకు, శీతల పానీయాలు సహా 148 వస్తువులపై టాక్స్‌ రేట్లను పెంచడానికి మంత్రుల బృందం సిఫార్సు చేసిందన్న వార్త అబద్ధమని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపించిన విషయాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ & ఎక్సైజ్ కస్టమ్స్’ (CBIC) ట్వీట్‌ చేసింది. GST రేటును పెంచుతున్నట్లు వచ్చిన వార్తలను పుకారుగా పేర్కొంది. ఇదే విషయంపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) కూడా ఓ ట్వీట్‌ చేశారు.

GoM నివేదిక అందలేన్న సీబీఐసీ
జీఎస్టీ రేట్లలో మార్పులకు సంబంధించి, మంత్రుల బృందం (GoM) ఇంకా తన నివేదికను సిద్ధం చేసి కౌన్సిల్ పరిశీలనకు సమర్పించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ పెంపుపై మీడియాలో వచ్చిన వార్తలు పుకార్లని స్పష్టం చేసింది.

GST కౌన్సిల్‌, వివిధ వస్తువులపై GST రేట్లను హేతుబద్ధీకరించడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో.. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ ఆర్థిక మంత్రులు సభ్యులు. బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి GoM చైర్మన్. GST కౌన్సిల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. GST రేట్లలో మార్పులు చేయడానికి కౌన్సిల్‌కు అధికారం ఉంది. మంత్రుల బృందం తన సిఫార్సులను మాత్రమే సమర్పించగలదు, నిర్ణయాలు తీసుకోలేదు. CBIC వెల్లడించిన ప్రకారం.. GST కౌన్సిల్ ఇంకా GST రేట్లలో మార్పుల గురించి ఆలోచించలేదు, GoM సిఫార్సులు ఇంకా కౌన్సిల్‌ వద్దకు చేరలేదు.

ఆర్థిక మంత్రి ట్వీట్‌
దేశంలో గందరగోళానికి, విమర్శలకు తావిచ్చిన జీఎస్‌టీ వార్తలపై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ కూడా స్పందించారు. ఆ వార్తలను సమయానుకూలంగా ఖండించినందుకు CBICకి కృతజ్ఞతలు చెప్పారు. “మంత్రుల బృందంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు GST రేట్లలో మార్పులను పరిశీలిస్తున్నారు. ఆ నివేదిక అందిన తర్వాత, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్‌టి కౌన్సిల్, తదుపరి సమావేశంలో ఆ సిఫార్సులను పరిశీలిస్తుంది. ప్రజలు ఊహాగానాలకు దూరంగా ఉండటం మంచిది” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

GST రేట్లను హేతుబద్ధీకరించే ప్రయత్నం!
రేట్లను హేతుబద్ధీకరించేందుకు (rationalization) బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం.. సిగరెట్లు, పొగాకు &సంబంధిత ఉత్పత్తులు, ఎరేటెడ్ బేవరేజెస్‌ (శీతల పానీయాలు సహా)పై జీఎస్‌టీ రేటును 35 శాతానికి పెంచాలని ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి, ఈ రేటు ప్రస్తుతం 28 శాతంగా ఉంది. రూ.1,500 దాటిన దుస్తులపైనా జీఎస్‌టీ రేటు మార్పునకు ప్రతిపాదించినట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి.

మరో ఆసక్తికర కథనం: స్థిరంగా బంగారం, వెండి మెరుపులు – తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు కొత్త ధరలు ఇవీ 

మరిన్ని చూడండి

Source link