cbse to conduct twice a year class 10 and class 12 board exams from 2025 26 session

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షలో విధానంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్స్ తరహాలో విద్యార్థులకు రెండు సార్లు సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు రాసే అవకాశం కల్పించింది. కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం.. 2025-26 విద్యాసంవత్సరం నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి లేకుండా ఎక్కువ స్కోర్ చేసేందుకు ఈ విధానం ప్రోత్సహిస్తోంది. దీంతోపాటు అదనంగా 2026-2027 విద్యాసంవత్సరంలో 260 విదేశీ స్కూళ్లలోనూ గ్లోబల్ సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2026 ఫిబ్రవరిలో ఒకసారి, మార్చిలో ఒకసారి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

పరీక్షల నిర్వహణకు ఉద్దేశించి.. ముసాయిదా పథకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, జాతీయ విద్యా పరిశోధన సంగథన్, నవోదయ విద్యాలయ సమితి ఉన్నతాధికారులతో  చర్చలు నిర్వహించారు. సెంటర్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏటా రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఫిబ్రవరి 24న ముసాయిదాను సీబీఎస్‌ఈ విడుదల చేయనుంది.

ఒత్తిడి తగ్గించేందుకే..
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ ​తెలిపింది. సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దాంతో పాటూ రెండు సార్లు పరీక్షలు రాయడం వలన విద్యార్ధులు పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యే ఛాన్స్ఉంటుంది. దానివలన వారికి స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది. అదే మొదటిసారిలోనే మంచి మార్కులు వస్తే రెండో సారి రాయక్కర్లేదు కూడా. దీనివలన ఏడాది మొత్తం ఒత్తిడి కూడా ఉండదని చెబుతున్నారు.

రెండింటిలో ఉత్తమ స్కోర్ పరిగణనలోకి.. 
ఈ విధానంతో విద్యార్థులు రెండుసార్లు పరీక్ష రాయడం ద్వారా అధిక మార్కులు పొందే అవకాశం విద్యార్థులకు కలగనుంది. రెండింటితో ఉత్తమ స్కోర్ ఆధారంగా తుది ఫలితాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. కేవలం పరీక్ష ద్వారా మార్కుల సాధించడమే కాదు నైపుణ్యం , సెల్ఫ్ డెవలప్ మెంట్ పై దృష్టి పెట్టడం ద్వారా జాతీయ విద్యావిధానం లక్ష్యాన్ని చేరుకోవచ్చంటున్నారు. అదనంగా 2026-27 విద్యాసంవత్సరంలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో గ్లోబల్ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టనున్నట్లు, భారత దేశ ముఖ్యమైన అంశాలను ఈ సెలబస్‌లో చేర్చడం వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. 

మూల్యాంకనంలోనూ మార్పులు..
వచ్చే ఏడాది నుంచి సీబీఎస్‌ఈ పరీక్షల మూల్యాకనంలోనూ మార్పులు జరుగనున్నాయని అగర్వాల్ తెలిపారు. సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల విద్యార్థులకు సంబంధించిన తుది గ్రేడ్‌లో ఇంటర్నల్ అసెస్‌మెంట్‌‌కు 40 శాతం మార్కులు, రాతపరీక్షకు 60 శాతం మార్కులు ఇవ్వనున్నారు ఆయన అన్నారు. 

కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ  విద్యావిధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ పరీక్షల్లో మార్పులు చేయాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదా కమిటీ గతంలో సూచించింది. ఇస్రో మాజీ చైర్మన్ కె. కస్తూరీ రంగన్ సారథ్యంలోని ఈ కమిటీ 11, 12వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్ని వర్తించాలని ప్రతిపాదించింది. ఈ విషయంపై 2023 అక్టోబర్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీబీఎస్‌ఈ విద్యార్థులు రెండు సార్లు  పరీక్షకు హాజరుకావడం తప్పనిసరేమీ కాదన్నారు. ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే స్టూడెంట్స్‌ ఏడాదికి రెండు సార్లు పది, పన్నెండవ తరగతుల పరీక్షలు రాసే అవకాశం ఉంటుందన్నారు. పరీక్షలకు హాజరవడం ఐచ్ఛికమని స్పష్టం చేశారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి…

మరిన్ని చూడండి

Source link