Universal Pension Scheme For All Indian Citizens: అభివృద్ధి చెందిన దేశాల తరహాలో భారతదేశంలోనూ ఓ పెన్షన్ పథకం ప్రవేశపెట్టనున్నారు. ఈ స్కీమ్ కింద, దేశంలోని ప్రతి ఒక్క పౌరుడూ పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతాడు. కొత్త పెన్షన్ పథకం పేరు “యూనివర్సల్ పెన్షన్ స్కీమ్” (UPS). కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ పథకానికి తుది రూపు ఇచ్చే పనిలో ఉందని అధికార వర్గాల సమాచారం. దేశంలోని పౌరులందరికీ, వారి వృద్ధాప్య సమయంలో ఆర్థిక భద్రత కల్పించడం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ఉద్దేశం.
పౌరులందరికీ పెన్షన్ ప్రయోజనం
సార్వత్రిక పింఛను పథకానికి (యూనివర్సల్ పెన్షన్ స్కీమ్) ఏ భారతీయ పౌరుడైనా విరాళం ఇవ్వవచ్చు. అంటే, ఏ వ్యక్తి అయినా ఈ స్కీమ్‌లో పాల్గొనవచ్చు. ఈ పథకాన్ని EPFO పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్లాన్ డిజైనింగ్ పని పూర్తయిన వెంటనే, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ దీనిని ప్రజల్లోకి తీసుకువస్తుంది. పథకాన్ని మరింత మెరుగ్గా & ఉపయోగకరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు, నిపుణులు, వివిధ మంత్రిత్వ శాఖలు సహా అందరు వాటాదార్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం, యూనివర్సల్ పెన్షన్ స్కీమ్‌ను ఆకర్షణీయంగా మార్చడానికి అనేక కొత్త & పాత పథకాలను దీనిలో చేర్చే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు, కార్మికులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, వ్యాపారస్తులు వంటి అసంఘటిత రంగానికి చెందిన వ్యక్తులకు ఈ పథకం ప్రయోజనాన్ని అందించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది.
ఏయే పథకాలను ఇందులో చేర్చవచ్చు?
సార్వత్రిక పింఛను పథకంలో ఏయే పథకాలను చేరుస్తారన్న విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొన్ని ప్రధానమైన, ఆకర్షణీయమైన పథకాలను చేర్చవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అవి –
ప్రధాన మంత్రి మాన్ ధన్ యోజన, జాతీయ పెన్షన్ పథకం – ఈ రెండు పథకాలు స్వచ్ఛందమైనవి (ఐచ్ఛికం). వీటి కోసం చందా చెల్లించిన వ్యక్తి, తన 60 సంవత్సరాల వయస్సు తరువాత ప్రతి నెలా రూ. 3000 పెన్షన్ పొందుతాడు. ఈ పథకాల్లో ప్రతి నెలా రూ. 55 నుంచి రూ. 200 వరకు జమ చేయవచ్చు. మీరు ఎంత విరాళం ఇచ్చారో, కేంద్ర ప్రభుత్వం కూడా అంత మొత్తాన్ని కలిపి పథకంలో జమ చేస్తుంది.
సార్వత్రిక పింఛను పథకంలో ‘అటల్ పెన్షన్ యోజన’ను కూడా చేర్చవచ్చు. ప్రస్తుతం ఈ పథకం PFRDA కిందకు వస్తుంది. దీంతోపాటు, భవన నిర్మాణ కార్మికుల చట్టం కింద వసూలు చేసిన సెస్‌ను కూడా చేర్చవచ్చు. దీని ద్వారా నిర్మాణ రంగంలోని కార్మికులకు కూడా పెన్షన్ ఇవ్వవచ్చు.
ఇంకా.. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పెన్షన్ పథకాలను కూడా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్‌లో చేర్చమని కేంద్ర ప్రభుత్వం కోరవచ్చు. దీనివల్ల ప్రజలకు అందే పింఛను మొత్తం పెరుగుతుంది, మరిన్ని ప్రయోజనాలను పొందగలరు.
దేశంలో వృద్ధుల అంచనా సంఖ్య
ఐక్యరాజ్యసమితి “ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023” ప్రకారం, 2036 నాటికి, భారతదేశంలో వృద్ధుల సంఖ్య దేశ మొత్తం జనాభాలో 15 శాతం ఉంటుందని అంచనా. 2050 నాటికి ఈ సంఖ్య 20 శాతానికి చేరుకుంటుంది. అంటే, ఆధారపడే వ్యక్తుల సంఖ్య భవిష్యత్‌లో పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో.. అమెరికా, యూరప్, చైనా, కెనడా, రష్యా వంటి దేశాల తరహాలో భారతదేశంలోనూ పెన్షన్ పథకాన్ని అమలు చేయడం చాలా ముఖ్యం. కొత్త పెన్షన్ ప్లాన్‌లో పెన్షన్‌తో పాటు ఆరోగ్యానికి సంబంధించిన సౌకర్యాలు ఉండాలి. భారతదేశంలో సామాజిక భద్రత ఎక్కువగా ఫండ్స్ & పెన్షన్లపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో, కొత్త పెన్షన్ పథకం సామాజిక భద్రత రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.
మరో ఆసక్తికర కథనం: రెండో రోజూ తగ్గిన పసిడి రేటు – తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ