ByKranthi
Sun 18th Jun 2023 10:13 PM
కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన ఆకస్మిక మరణ వార్త ఇప్పుడు టాలీవుడ్‌ని విషాదంలో నింపేసింది. గత కొంత కాలంగా రాకేశ్ మాస్టర్ ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నారో తెలియంది కాదు. కరోనా టైమ్‌లో కూడా ఆయన ధైర్యంగా బయటికి వచ్చి తనకు చేతనైనంతగా సాయం అందించారు. అయితే వారం రోజుల క్రితం ఆయన వైజాగ్‌లో ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ షూటింగ్ అనంతరం హైదరాబాద్ వచ్చేసిన రాకేశ్ మాస్టర్ సడెన్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆదివారం ఉదయం ఆయనకు రక్త విరోచనాలు కావడంతో.. పరిస్థితి మరింతగా విషమించిందని గ్రహించిన కుటుంబ సభ్యులు.. చికిత్స నిమిత్తం ఆయనని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయనని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
డయాబెటిక్ పేషెంట్ కావడంతో పాటు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినట్లుగా డాక్టర్స్ గుర్తించి, చికిత్స ప్రారంభించినప్పటికీ.. ఆయన కోలుకోలేకపోయారు. సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ తుది శ్వాస విడిచినట్లుగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. ఆయన మరణవార్త తెలిసి యావత్ టాలీవుడ్ పరిశ్రమ దిగ్ర్భాంతికి లోనైంది. రాకేశ్ మాస్టర్‌తో అనుబంధం ఉన్న వాళ్లు కన్నీరుమున్నీరవుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
రాకేశ్ మాస్టర్ తిరుపతిలో జన్మించారు. ముక్కు రాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పని చేసిన ఆయన.. ఆ తర్వాత తనే కొరియోగ్రాఫర్‌గా మారి.. దాదాపు 1500కు పైగా చిత్రాలలోని పాటలకు కొరియోగ్రఫీ అందించారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి వారంతా ఆయన శిష్యులే. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య వంటి హిట్ చిత్రాలకు రాకేశ్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. అయితే కొంతకాలంగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లుగా బిహేవ్ చేస్తూ వస్తున్నారు. కొరియోగ్రఫీ కూడా మానేసి యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ.. వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. సడెన్‌గా ఇప్పుడు ఆయన ఈ లోకం విడిచి వెళ్లారంటే.. ఎవరూ నమ్మడం లేదు.
Choreographer Rakesh Master passed away:
Choreographer Rakesh Master breathes his last