Cinejosh Review – Court సినీజోష్ రివ్యూ

సినీజోష్ రివ్యూ – కోర్ట్  

తెలుగు సినిమా కథా నాయకుల్లో

నాని కథల ఎంపిక విభిన్నం, నాని తీరే వైవిద్యం 

హీరోగా తను చేసే సినిమాలనే చాలా సెలెక్టివ్ గా ఎంచుకునే నాని

తనే నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నాడంటే ఆ కథని అతనెంతగా నమ్మాడో,

ఆ కథ లో ఉన్న విలువైన విషయాన్ని ప్రేక్షకులకు చెప్పడానికి ఎందుకు ప్రయత్నించాడో అర్ధం చేసుకోవచ్చు. 

ఈ కోర్ట్ అనే సినిమా మీకు నచ్చకపోతే నేను చేస్తోన్న హిట్ 3 చూడకండి అనేంత స్టేట్మెంట్ ఇచ్చేలా నాని కి అంతటి గట్ ఫీలింగ్ కలిగించిన కోర్ట్ నిజంగా ఆ స్థాయిలోనే ఉందా.. ఆడియన్స్ కి కూడా నాని కి కలిగిన సంతృప్తినే ఈ సినిమా ఇవ్వగలిగిందా.. ఇది కోర్ట్ కథ. వాదోపవాదాలు ఉంటాయి, వివరణలు విశ్లేషణలు ఉంటాయి. ఫైనల్ జడ్జిమెంట్ ఏమిటో రివ్యూ చదివి ఫైనల్ వెర్డిక్ట్ లో తెలుసుకుందాం. 

కోర్ట్ సబ్జెక్ట్: 

కోర్ట్ రూమ్ డ్రామా అంటే ఒకప్పుడు 12, యాంగ్రిమెన్ వంటి హాలీవుడ్ సినిమాలు గుర్తొచ్చేవి. కానీ మనవాళ్ళు కూడా ఆ అంశం పై దృష్టి పెట్టారు. హిట్లు కొట్టారు. తమిళ్ లో సూర్య జై భీమ్ చేస్తే, మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ జనగణమణ చేసి శెభాష్ అనిపించుకున్నారు. హిందీలో అమితాబచ్చన్ పింక్ అనే సినిమా చేస్తే అదే సినిమాని అరువు తెచ్చుకుని వకీల్ సాబ్ వావ్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడంటే స్టార్స్ ఉన్నారు. హ్యాండిల్ చేయగలిగారు. కానీ ఈ నాని తీసిన సినిమాలో స్టార్స్ లేరు. స్టార్ ఎట్రాక్షన్ లేదు. బట్ కంటెంట్ ఉంది. కాన్సెప్ట్ ఉంది. ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే మేటర్ ఉంది. మెటీరియల్ ఉంది. ఓ అబ్బాయి ఓ అమ్మాయి యుక్త వయసులో ప్రేమించుకోవడం ఎంత సహజమో, ఆ ఇద్దరి స్థాయి సమం కానప్పుడు కొన్ని ఉద్వేగాలు చెలరేగడం సహజం. ఇటువంటివి మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాము. టీవీల్లో చూస్తూ ఉన్నాము. ప్రత్రికల్లో చదువుతూ ఉన్నాం. అలాంటి నేపధ్యాన్ని ఎంచుకున్నాడు ఈ చిత్ర దర్శకుడు. చట్టాలు గట్టిగానే చేసినా వాటిని దుర్వినియోగం చేస్తున్న వారి వైఖరిని తెలియజేయడమే ఈ కోర్ట్ కథ. ఈ కథలో మనకి ఆ మధ్య కాలంలో జరిగిన ఓ పరువు హత్య గుర్తొస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో పరువు పోగొట్టుకున్న ఒక సినిమా టెక్నీషియన్ బాధ కనిపిస్తుంది. నేటికీ ఇలా, ఇంతటి మదంతో ప్రవర్తించేవాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఓ సాధారణ యువకుడిపై అన్యాయంగా మోపబడిన నేరాన్ని పరిష్కరించే ఓ జూనియర్ లాయర్ మిషన్ ఇది. ఇందులో ఫస్ట్ హాఫ్ లో ఓ లవ్ స్టోరీ ఉంటుంది. అదేమంత గొప్పగా లేకపోయినా మరీ విసిగించేంత బ్యాడ్ గా అయితే ఉండదు. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే కథ కోర్టు కి చేరుతుందో అక్కడి నుంచే ఈ సినిమాపై నాని పెట్టుకున్న నమ్మకం ప్రేక్షకులకు కనబడుతుంది. 

కోర్ట్ రిపోర్ట్ :

న్యాయస్థానం సవ్యంగానే ఉంటుంది. చట్టం గట్టిగానే పని చేస్తుంది. కానీ అందులోని లొసుగులు వాడుకుంటూ తప్పుడు కేసులు పెడుతూ అమాయకులని అవమానిస్తూ, ఆక్షేపిస్తూ, ఆరోపిస్తూ జరుగుతోన్న కొన్ని కేసుల గుట్టు ఈ కోర్ట్ బట్టబయలు చేసింది. చట్టమేమిటో సెక్షన్ ఏమిటో సగటు ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చేసింది. 2013 నేపథ్యంలో సాగే కథగా ఈ చిత్రాన్ని చూపించినా 2025 ఆడియన్స్ కూడా ఐడెంటిఫై అయ్యేలా చెయ్యడంలో కోర్ట్ సినిమా క్లైమాక్స్ సక్సెస్ అయ్యింది. ఫోక్సో చట్టంతో పాటు ఇతర కఠినమైన సెక్షన్ల వివరాలన్నీ దర్శకుడు జనానికి వివరించే ప్రయత్నం చేసాడు. ఈ ప్రాసెస్ లో కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా నాని నమ్మిన మేటర్ ని తను రాసుకున్న స్క్రిప్ట్ ని స్పష్టంగా తెరపైకి తేవడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా చివరి అరగంట ఈ సినిమా అందరిని మెప్పించడంలో ప్రధాన పాత్ర పోషించింది. 

కోర్ట్ ఎఫర్ట్ :

బలగం సినిమా రిజల్ట్ తో నటుడిగా తన బలం చాటుకున్న ప్రియదర్శి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. ఈ సినిమాలో ఏ కేరెక్టర్ చేసినా ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. బహుశా అందుకేనేమో నాని ముచ్చటపడ్డాడు, ఏరికోరి అతన్నే ఎంచుకున్నాడు, జూనియర్ లాయర్ తేజ కేరెక్టర్ లో ప్రియదర్శి నటన నాని నమ్మకాన్ని సెంట్ పెర్సెంట్ నిలబెట్టింది. పలు సినిమాల్లో చైల్డ్ యాక్టర్ గా చేసిన రోషన్ కోర్ట్ లో ముద్దాయిగా నిలబడే చందుగా చక్కగా కుదిరాడు. అలాగే అతని ప్రేయసి జాబిలిగా శ్రీదేవి ఆకర్షణీయంగా కనిపంచింది. లాయర్లు గా సాయి కుమార్, హర్ష వర్ధన్ ఇద్దరూ మంచి డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ఇక అందరిని మించి మంగపతి పాత్రలో శివాజీ చెలరేగిపోయాడు. కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన శివాజీకి చాలా పెద్ద బ్రేకిచ్చే రోల్ ఇది. 

విజయ్ సంగీతం కథలోని ఇంటెన్సిటీకి యాడెడ్ హెల్ప్ అయ్యింది. దినేష్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రెమ్ ని సినిమా కథనానికి అనుగుణంగా మలిచింది. దర్శకుడు రామ్ జగదీశ్ తాను నమ్మిన కథని తను అనుకున్నట్టుగా తెరపైకి తెచ్చుకున్నాడు. నాని నిర్మాతగా మారి తనకిచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకున్నాడు. కోర్ట్ అనే సినిమా రిజల్ట్ తో ఇప్పటికే హీరో నాని పై ఉన్న క్రెడిబులిటీ  పెరుగుతుంది. వెల్ డన్ నాని.  

కోర్ట్ రిజల్ట్:

కాన్సెప్ట్ బావుంది, సినిమాలో కంటెంట్ ఉంది. కానీ రిలీజ్ టైమ్ రాంగ్ గా ఉంది. నాని ఎంత ప్రమోట్ చేసినా, సినిమాకి సోషల్ మీడియాలో ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినా, అన్ని మేజర్ వెబ్ సైట్స్ లో ఎన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చినా థియేటర్ కి జనం వస్తారా, నాని పెట్టుబడిని తిరిగిస్తారా, లాభాలు చూపిస్తారా అనేది మాత్రం సందేహంగా ఉందంటున్నారు విశ్లేషకులు. హోలీ నేపథ్యంలో ఎంతవరకు ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి. ఈ కోర్ట్ వాదన థియేటర్స్ లో ఎన్ని రోజులు వినిపిస్తోందో వినాలి. 

థియేట్రికల్ రెవెన్యూ ఎలా ఉన్నా, రన్ ఎంత వచ్చినా ఒన్స్ ఓటీటీ లోకి వచ్చాక మాత్రం ఈ కోర్ట్ షార్ట్ టైమ్ లోనే అందరికి కనెక్ట్ అయిపోతుంది. అందరి అభినందనలు అందుకుంటుంది.

సినీజోష్ పంచ్ లైన్ : నాని నమ్మకం నిలబెట్టింది !

సినీజోష్ రేటింగ్: 3/5

Source link