ByKranthi
Thu 01st Feb 2024 12:20 AM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని.. మేనేజ్మెంట్ కోటాలో ఎన్నికైన ముఖ్యమంత్రంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన ఉద్దేశమేంటంటే.. తెలంగాణలో సీఎం సీటు కోసం సీనియర్లంతా పోటీ పడ్డారు కాబట్టి ఒకవేళ రేవంత్ సీఎం అయినా హర్షించరు. మనం ఏం మాట్లాడినా వారు కూడా ఎంజాయ్ చేస్తారనే భావం ఉండి ఉండొచ్చు. కానీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టి కౌంటరే ఇస్తున్నారు. సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత ఉండదనుకున్న బీఆర్ఎస్ నేతలకు ఝలక్ ఇస్తున్నారు. గతం గత:.. ఇప్పుడు అంత సీన్ లేదు. మేమంతా కలిసే ఉన్నామంటూ ప్రత్యర్థి పార్టీలకు కాస్త గట్టిగానే కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
రూ.50 కోట్లిచ్చి సీఎం పదవి సంపాదించుకున్నారా?
అసలు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే.. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదట. మేనేజ్మెంట్ కోటాలో ఎన్నికయ్యారట. అంతటితో ఆగితే బాగానే ఉండు.. మాణిక్కం ఠాగూర్‌కు రూ.50 కోట్లు ఇచ్చి మేనేజ్ చేసి రేవంత్ ముఖ్యమంత్రి పదవిని సంపాదించుకున్నారంటూ పెద్ద పెద్ద విమర్శలే చేశారు. అంతేకాదు.. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవని గుర్తు పెట్టుకోవాలంటూ రేవంత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇక కాంగ్రెస్ నేతలు ఊరుకుంటారా? కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. ఇక మాణిక్కం ఠాగూర్ అయితే రేవంత్‌పై నిరాధార ఆరోపణలు చేసినందుకు గానూ మదురై హైకోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
కాలిగోటికి సరిపోని వ్యక్తే.. ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టాడు..
బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడవద్దని.. పద్ధతి మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కేటీఆర్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాలిగోటికి కూడా సరిపోడన్న వ్యక్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపి.. ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టాడు కదా అని కౌంటర్ ఇచ్చారు. అంతేనా.. కాలి గోటికి సరిపోని వ్యక్తే బీఆర్ఎస్ నేతల్ని ఒక్క తొక్కు తొక్కాడని.. దీంతో ఒక్కొక్కరూ.. 50 వేల ఓట్ల మెజారిటీ తో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. అసలు రేవంత్ రెడ్డి చిటికెన వేలుకు కూడా కేటీఆర్ సరిపోడని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మరోవైపు మంత్రి సీతక్క సైతం గట్టి కౌంటరే కేటీఆర్‌కు ఇచ్చారు. రేవంత్‌ని అన్నా కూడా సైలెంట్‌గా ఊరుకుంటారు పైగా ఎంజాయ్ చేస్తారనుకుంటే ఇలా నేతలంతా రెచ్చిపోవడం కేటీఆర్‌కే షాకింగ్‌గా మారి ఉంటుంది.
Congress Leaders Counters on KTR:
KTR Shock with Congress Leaders Counters