Covid Cases In India India Records 841 Covid-19 Cases Amid JN.1 Variant Spike

Corona Cases in India: 

841 కేసులు నమోదు..

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 841 కరోనా కేసులు (Covid Cases in India) నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య పరంగా చూస్తే గత 227 రోజుల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి చేరుకుంది. గత 24 గంటల్లో ముగ్గురు కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఒకరు, కర్ణాటక, బిహార్‌లో ఇద్దరు మృతి చెందారు. ఇన్‌ఫెక్షన్ రేటు తక్కువగానే ఉంటోందనుకునే లోపే ఉన్నట్టుండి కేసులు పెరుగుతున్నాయి. డిసెంబర్ 5వ తేదీ వరకూ పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ ఆ తరవాత బాధితులు పెరుగుతున్నారు.  JN.1 sub-variant వ్యాప్తి వేగంగా ఉంటోంది. 2020 జనవరిలో కరోనా వ్యాప్తి మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 4.50 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి రికవరీ రేటు 98.81%గా ఉంది. అయితే…కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలందరూ కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే అందరూ సహకరించాలని కోరుతున్నారు. ఇప్పటికే రకరకాల వ్యాధులతో బాధ పడుతున్న వాళ్లు రద్దీ ప్రాంతాల్లో తిరగకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్‌లు కచ్చితంగా ధరించాలని చెబుతున్నారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో 178 JN.1 వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గోవాలో అత్యధికంగా 47 కేసులు కేరళలో 41 మంది బాధితులున్నారు. గుజరాత్‌లో 36,కర్ణాటకలో 34, మహారాష్ట్రలో 9, రాజస్థాన్‌లో 4,తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఢిల్లీలో ఒక కేసు నమోదైంది. 

Source link