Delhi Floods AAP Alleges Haryana’s BJP Govt Over Delhi Waterlogging, Says Sponsored Flood | Delhi Floods: మూడు రోజుల వర్షానికే ఢిల్లీ ఇలా అవుతుందా, ఇవి బీజేపీ స్పాన్సర్ చేసిన వరదలు

Delhi Floods: 

మాటల యుద్ధం..

ఢిల్లీలో ఓ వైపు భారీ వర్షాలు కురిసి వాతావరణమంతా చల్లబడితే…రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. దేశ రాజధానిని ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడానికి (Delhi Rains) కారణం బీజేపీయే అని ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. కుట్రపూరితంగానే హరియాణా ప్రభుత్వంతో కుమ్మక్కై ఢిల్లీలోకి వరదలు వదిలారని విమర్శించింది. నియంత్రించే అవకాశం లేకుండా భారీ స్థాయిలో నీళ్లు వదిలారని ఆప్ మంత్రులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే కేంద్రహోం మంత్రి అమిత్‌షాకి లేఖ రాశారు. హరియాణాలోని హత్నికుండ్ బ్యారేజ్ (Hathnikund barrage) నుంచి వరద నీటిని వేగంగా  కాకుండా కాస్త నెమ్మదిగా వదలాలని కోరారు. అయితే…దీనిపై హరియాణా మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఆప్ చేసే ఆరోపణలను ఖండించారు. బ్యారేజ్ నుంచి నీళ్లు వదలడం తప్ప వేరే ఆప్షన్ లేదని తేల్చి చెప్పారు. ఎక్కువ నీళ్లు అలాగే ఉంచితే బ్యారేజ్ ధ్వంసమయ్యే ప్రమాదముందని అందుకే వదలాల్సి వచ్చిందని వివరించారు. ఎక్కువ మొత్తంలో నీరు నిల్వ ఉంచడానికి ఇది రిజర్వాయర్ కాదని స్పష్టం చేశారు. పరిమితి మించిన తరవాతే గేట్లు ఎత్తివేసినట్టు చెప్పారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా అరవింద్ కేజ్రీవాల్‌ హోంమంత్రికి లేఖ రాయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 

“హత్నికుండ్‌…డ్యామ్ కాదు. ఇదో బ్యారేజ్. ఢిల్లీలో ఉన్న ఓక్లా బ్యారేజ్‌ గేట్లు కూడా పూర్తి స్థాయిలో ఎత్తేయాల్సి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. హత్నికుండ్ నుంచి వచ్చే నీళ్లను ఆపేయాలని కోరారు. అదెలా సాధ్యమవుతుంది. ఎక్కువ నీళ్లను నిల్వ చేసుకోడానికి ఇదేమీ డ్యామ్ కాదు. గేట్లు ఎత్తేయకుండా ఉంటే భారీ స్థాయిలో విధ్వంసం చూడాల్సి వస్తుంది. వేలాది మంది ప్రాణాలకు ముప్పు తప్పదు. ఇదంతా తెలిసి కూడా లేఖ రాయడం ఏంటి..? ఆయన చెప్పినట్టు చేస్తే హరియాణా, పంజాబ్‌లో భారీ స్థాయిలో ప్రాణనష్టం వాటిల్లుతుంది”

– కపిల్ మిశ్రా, బీజేపీ నేత 

ట్విటర్‌లో విమర్శలు..

బ్యారేజ్ గేట్‌లు ఎందుకు ఎత్తేయాల్సి వచ్చిందో అధికారులు వివరిస్తున్నారు. ఈ స్థాయిలో వరద నీరు వచ్చి చేరడం వల్ల బ్యారేజ్ డ్యామేజ్ అవుతుందని, అందుకే హెడ్ రెగ్యులేటర్ గేట్స్‌ని మూసేసి…క్రాస్ రెగ్యులేటర్ గేట్స్‌ని తెరిచినట్టు చెప్పారు. ఇలా చేయడం వల్లే యమునా నది ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రవహించిందని స్పష్టం చేశారు. అటు ఆప్ మాత్రం వరుస ట్వీట్‌లతో  బీజేపీపై విరుచుకు పడుతోంది. 

“దాదాపు మూడు రోజులుగా ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. కానీ వరద మాత్రం అంతకన్నా ఎక్కువగా ఉంది. దీనికి కారణం బీజేపీ కుట్రే. భారీ వర్షపాతం నమోదు కాకుండానే ఇంత వరదలు ఎందుకొచ్చాయి? ఏ రాష్ట్రమైనా ఆపదలో ఉంటే కేజ్రీవాల్ వాళ్లకు సాయం అందించడంలో ముందుంటారు. కానీ…ఇప్పుడా పరిస్థితి ఢిల్లీకే వచ్చింది. ఇవి కచ్చితంగా బీజేపీ స్పాన్సర్ చేసిన వరదలే”

– ఆమ్ఆద్మీ పార్టీ 

Source link