Delhi Ordinance Bill ‘Delhi Is Not A Full State, We Have Full Right To Make Laws’ Says Union Home Minister Amit Shah | ఢిల్లీ పాలనా వ్యవహారాలపై కేంద్రానికి హక్కు ఉంది, మళ్లీ మోదీయే ప్రధాని అవుతారు

Delhi Ordinance Bill: 

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్‌పై చర్చ  

కేంద్రహోం మంత్రి అమిత్‌షా లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్‌ని తీసుకొచ్చారు. విపక్షాల ఆందోళనల మధ్యే అమిత్‌షా ప్రసంగం కొనసాగింది. ప్రతిపక్షాలు INDIA కూటమిపై కాకుండా ఢిల్లీపై దృష్టి పెడితే బాగుంటుందని చురకలు అంటించారు షా. సుప్రీంకోర్టు తీర్పునీ లెక్క చేయకుండా బిల్ తీసుకొచ్చారన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఢిల్లీలో పాలనా వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవచ్చని, ఆ అధికారం రాజ్యాంగమే ఇచ్చిందని తేల్చి చెప్పారు. కొందరు తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే ఈ బిల్‌ని వ్యతిరేకిస్తున్నారని ఆప్‌పై విమర్శలు చేశారు. ఆప్‌ అవినీతినీ ప్రస్తావించారు. 

“2015లో ఆప్‌ అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీ గద్దెనెక్కింది కేవలం కేంద్రంతో యుద్ధం చేయడానికే తప్ప ప్రజలకు మంచి చేయాలని కాదు. వాళ్ల సమస్య అధికారుల బదిలీ కాదు. ఈ బిల్‌ తీసుకొస్తే ఎక్కడ తాము అధికారం కోల్పోయి అవినీతి అంతా బయటపడుతుందోనని భయపడుతున్నారు”

– అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి 

రాష్ట్ర హోదాకి వ్యతిరేకం..

ఇదే సమయంలో కాంగ్రెస్‌పైనా విమర్శలు చేశారు అమిత్‌షా పండిట్ జవహర్ లాల్ నెహ్రూతో పాటు అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా లేదని, అలాంటప్పుడు కేంద్రం అక్కడి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చన్న ప్రొవిజన్ రాజ్యాంగంలోనే ఉందని తేల్చి చెప్పారు. ఇండియా కూటమిలో ఎంత మంది చేరినా…మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని అన్నారు. 

“మీరు ప్రతిపక్ష కూటమిలో ఉన్నంత మాత్రాన ఢిల్లీలో జరుగుతున్న అవినీతికి మద్దతునివ్వకండి. ఢిల్లీకి రాష్ట్రహోదా ఇవ్వడాన్ని నెహ్రూతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేడ్కర్ వ్యతిరేకించారు. ప్రతిపక్ష ఎంపీలంతా కేవలం కూటమి గురించే కాదు. ఢిల్లీ గురించి కూడా ఆలోచించాలి”

– అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి

 

Source link