Delimitation Row:సామాన్య జనం పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ ఇప్పటికే రెండు విషయాల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని మేధావి వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ఒకటి జిఎస్టి ఆదాయం పంపకంలో వివక్ష, రెండు బలవంతంగా హిందీ భాషను రుద్దుతున్నారు అనే ఆరోపణలు దక్షిణాది రాజకీయ వర్గాల నుంచి బలంగా వస్తున్నాయి. ఇప్పుడు వాటికి ఇంకొక పెద్ద సమస్య వచ్చి చేరింది. అదే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ( డీ లిమిటేషన్). దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీల సీట్ల పెంపకం ఉత్తరాదితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని దానితో పార్లమెంట్లో తమ వాయిస్ బలంగా వినిపించే సామర్థ్యం ఇకపై ఉండదని దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అసలు ఏంటి ఈ డీ లిమిటేషన్ ఇప్పుడే ఎందుకు?
భారత రాజ్యాంగంలో పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం జనాభా పెరిగినప్పుడు వారి సంఖ్యకు అనుగుణంగా పార్లమెంట్లో నియోజకవర్గాల సంఖ్య పెంచాలనే నియమం ఉంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు విపరీతంగా పెరిగిపోతున్న జనాభాను కంట్రోల్ చేసే లాగా కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆ సమయంలో నియోజకవర్గాల పెంపును చేపట్టడం కరెక్ట్ కాదని భావించి 42వ సవరణ ద్వారా మరో పాతికేళ్లపాటు నియోజకవర్గాల పీపు లేదంటూ పోస్ట్‌పోన్ చేశారు. 2001లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానంగా ఉన్నప్పుడు కూడా ఒకవైపు సౌత్ ఇండియాలో కుటుంబ నియంత్రణ బాగా పాటిస్తున్నారు. కాబట్టి జనాభా తగ్గుతోంది. నార్త్ ఇండియాలో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ సమయంలో నియోజకవర్గాల్ని జనాభా ఆధారంగా పెంచితే సౌత్ ఇండియా బాగా నష్టపోతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరో పాతికేళ్లు పోస్ట్ పోన్ చేస్తూ 84వ సవరణ తీసుకొచ్చారు. దాని ప్రకారం 2026లో అంటే వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. కానీ ఈ పాతికేళ్లలో నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగితే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో జనాభా పెరుగుదల తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు దక్షిణాదికి అదే పెద్ద సమస్యగా మారబోతోంది.
సౌత్ ఇండియాకు ఎదురయ్యే సమస్య ఏంటి
ప్రస్తుతం పార్లమెంట్‌లోని లోక్ సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్నికల్లో గెలిచిన ఏ పార్టీ అయినా అధికారం చేపట్టాలంటే 50% దాటి సీట్లు సాధించాలి. అంటే కనీసం 272 మంది ఎంపీలు ఉండాలి. కానీ మొన్నటి ఎన్నికల్లో బిజెపికి కేవలం 240 సీట్లే వచ్చాయి. ఎన్డీఏ పార్టీల మద్దతుతో తమ బలాన్ని 293గా చూపించి మళ్లీ అధికారం లోకి వచ్చారు కమలనాథలు. దానికి ఉపయోగపడింది ఏపీలోని తెలుగుదేశం+జనసేన (16+2) అందించిన మద్దతుతో పాటు బిహార్ నుంచి JDU (12) సీట్ల సపోర్ట్. అందుకే ఏపీకి సంబంధించి ఎలాంటి డిమాండ్ అయినా ఎంతో కొంత తీర్చేందుకు ప్రధాని మోదీ తొందర పడుతున్నారు. ఇది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అయితే 2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్‌కు మూడు సీట్లు (25+3), తెలంగాణకు మరో మూడు సీట్లు (17+3), తమిళనాడులో 2 సీట్లు (39+2) కర్ణాటకలో 8 సీట్లు (28+8) మాత్రమే పెరుగుతాయి. ఎందుకంటే గడిచిన 50 ఏళ్లలో ఆధునిక భావాలతో జనాభా పెరుగుదలకు కంట్రోల్ చేశాయి దక్షిణాది రాష్ట్రాలు. కానీ అదే నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్‌లో పార్లమెంటు స్థానాలు 80 నుంచి 128, బిహార్‌లో 40 నుంచి 70 వరకూ పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విధానాన్నే తప్పుపడుతున్నారు. నార్త్‌లో భారీగా పెరిగే సీట్లతో తమకు కావలసిన మెజారిటీని అక్కడే తెచ్చేసుకుంటే జాతీయ పార్టీలు రేపొద్దున్న అసలు దక్షిణాది రాష్ట్రాల సమస్యల గురించి, అభివృద్ధిలో వాటా గురించి పట్టించుకుంటాయా అనేది వారు లేవనెత్తుతున్న ఆందోళన. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో నార్త్ వర్సెస్ సౌత్ అంటూ పెద్ద ఎత్తున విద్వేషాలు చెలరేగిపోతాయి అనేది వారి భయం.
అమిత్ షా ఏమన్నారు?
ఈ సమస్యపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ డిలిమిటేషన్ ప్రక్రియ జనాభా ఆధారంగా ఉండదని ప్రస్తుతం పార్లమెంటులో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉన్నాయో అంతే పర్సంటేజ్‌తో 2026 లో పెరిగే లోక్‌సభ సీట్ల పర్సంటేజ్‌లోనూ ఉంటాయని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఉన్న 543 స్థానాలను 750 వరకు పెంచాలి అనేది కేంద్రం ఆలోచన. అదే జరిగితే అమిత్ షా చెబుతున్నదాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాల సంఖ్య 25 నుంచి 34కు, తెలంగాణ స్థానాల సంఖ్య 17 నుంచి 23కు పెరుగుతాయి. నార్త్ ఇండియాలో పార్లమెంట్ స్థానాల సంఖ్య కూడా మరీ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవు. దీనితో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదనేది హోం మంత్రి చెబుతున్న మాట.
తమిళనాడు, కర్ణాటక సీఎంల సందేహం ఏమిటి?
అమిత్ షా భరోసాపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి మాటలను నమ్మలేమనేది వారి వాదన. సౌత్ ఇండియన్ రాష్ట్రాలన్నీ డీలిమిటేషన్‌లో జరిగే అన్యాయంపై కలిసికట్టుగా పోరాడకుండా ఉండడానికి కావాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని సిద్ధరామయ్య చాలా బలంగా చెబుతున్నారు. గడచిన 50 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలన్నీ ఎంతో ఎఫెక్టివ్‌గా కుటుంబ నియంత్రణ అమలు చేసి జనాభాను అదుపులో ఉంచినందుకు దక్కిన ఫలితం ఇలా అంటూ ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. మరి రానున్న రోజుల్లో ఈ సమస్యను కేంద్రం ఎలా పరిష్కరిస్తుందో అన్న చర్చ దేశవ్యాప్తంగా గట్టిగా జరుగుతోంది.
మరిన్ని చూడండి