Aadhar Voter Link: భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించుకుంది. ఈ అనుసంధానంపై న్యూఢిల్లీలో జరిగిన చర్చలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఎలా అనుసంధానం చేయాలన్న అంశంఫై సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు చేపడతామని ఈసీ తెలిపింది. ఆర్టికల్ 326, ప్రజా ప్రతినిధులు చట్టం-1950,అలాగే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను అనుసరించి.. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో యూఏడీఐ, ఈసీఐ మధ్య సాంకేతిక పరమైన అంశాలపై ఓ స్పష్టత తీసుకోనుంది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పటికే చాలా వరకూ ఓటర్,ఆధార్ అనుబంధానాన్ని ఓటర్లు స్వచ్చందంగా చేసుకున్నారు. అయితే తప్పనిసరి కాదు. స్వచ్చందంగా ఆన్ లైన్ లో చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం విషయంలో భారతదేశంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం ఒక వైపు ఉండగా, ప్రతిపక్ష పార్టీలు, గోప్యతా హక్కుల కార్యకర్తలు మరో వైపు వాదనలు వినిపిస్తున్నారు.
ఆధార్‌తో ఓటరు ఐడీ అనుసంధానం చేయడం వల్ల వ్యక్తుల వ్యక్తిగత డేటా దుర్వినియోగం కావచ్చని కొన్ని సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు 2018లో ఆధార్‌పై ఇచ్చిన తీర్పులో, గోప్యత ఒక ప్రాథమిక హక్కు అని పేర్కొంది . ఆధార్ వినియోగాన్ని కొన్ని ప్రత్యేక ప్రయోజనాలకు మాత్రమే పరిమితం చేసింది. ఓటరు ఐడీతో లింక్ చేయడం ఈ తీర్పును ఉల్లంఘించే అవకాశం ఉందని ..డేటా లీక్ అయితే లేదా ప్రభుత్వం దీన్ని నిఘా కోసం ఉపయోగిస్తే పౌరుల గోప్యతకు ముప్పు వాటిల్లుతుందనే భయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేశాయి.
2015లో ఎన్నికల సంఘం ఆధార్‌తో ఓటరు ఐడీలను ప్రయోగాత్మకంగా అనుసంధానం చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 55 లక్షల ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుండి తొలగిపోయాయని ఆరోపణలు వచ్చాయి. ఆధార్ లేని లేదా ఆధార్ వివరాలు సరిపోలని వారి ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు, గిరిజనులు వంటి వర్గాల వద్ద ఆధార్ కార్డు లేకపోవడం లేదా సరైన వివరాలు లేకపోవడం వల్ల వారు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం , ఎన్నికల సంఘం ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల నకిలీ ఓటర్లను గుర్తించ వచ్చని వాదిస్తున్నాయి.
2021లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు ప్రకారం, ఆధార్‌తో ఓటరు ఐడీ అనుసంధానం ఐచ్ఛికం మాత్రమేనని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఐచ్చికంగానే ఈసీ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని చూడండి