Paytm Payments Bank Crisis: పేటీఎమ్ సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌లోని లోపాలను చాలా స్పష్టంగా వెల్లడించింది. ఆ తప్పుల్ని సరిదిద్దుకోడానికి సరిపడా సమయం ఇచ్చినా కంపెనీ పట్టించుకోలేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది. Paytm Payments Bank కేసులో విచారణ మొదలు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమపై ఈడీ విచారణ ఏమీ జరగడం లేదని పేటీఎమ్ స్పష్టం చేసినప్పటికీ…ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైనట్టు సమాచారం. ఈ సంక్షోభం కారణంగా…Paytm షేర్స్ ఒక్కరోజులోనే 9% మేర పడిపోయాయి. ఇప్పటికే RBI ఆంక్షలతో సతమతం అవుతున్న పేటీఎమ్ ఇప్పుడు ఈడీ విచారణతో మరింత క్రెడిబిలిటీ కోల్పోనుంది. జనవరి 31వ తేదీన RBI ఈ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎమ్ వాల్యూ దాదాపు 60% మేర పడిపోయింది. అంటే దాదాపు 2.6 బిలియన్ డాలర్ల మేర సంపదను కోల్పోవాల్సి వచ్చింది.
RBI ఏం చెప్పిందంటే..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై (Paytm Bank Crisis) స్పందించారు. ఆంక్షలు విధించే ముందే ఆ సంస్థకి తగిన సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. వాళ్ల తప్పుల్ని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఆంక్షలు విధించినట్టు వెల్లడించారు. తాము ఎప్పుడూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోమని తెలిపారు. సూపర్‌వైజరీ సిస్టమ్‌ని బలోపేతం చేశామని, ఏ సంస్థలో ఇలాంటి అవకతవకలు కనిపించినా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. పేటీఎమ్ సంస్థలోని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు అవసరమైన సమయాన్ని ఇచ్చినట్టు తెలిపారు.
“మా నిఘా వ్యవస్థని చాలా బలోపేతం చేశాం. ఒక్క పేటీఎమ్ విషయంలోనే కాదు. ఏ సంస్థలో ఇలాంటి అవతకవతకలు అనిపించినా వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. ఏ సంస్థ అయినా తప్పులు సరిదిద్దుకోవాలన్నదే మా ఉద్దేశం. ఆంక్షలు విధించే ముందు తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పాం. అందుకు తగిన సమయాన్నీ ఇచ్చాం. మాతో సరైన విధంగా సంప్రదింపులు జరపకపోతే…మేం అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోతే అప్పుడే మేం చర్యలు తీసుకుంటాం”
– శక్తికాంత దాస్, RBI గవర్నర్
నిర్మలా సీతారామన్‌తో భేటీ..
ఈ క్రమంలోనే పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekhar Sharma) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 6వ తేదీన ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుత సంక్షోభంపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే RBI ఉన్నతాధికారులతో ఓ సారి భేటీ అయ్యారు శేఖర్ శర్మ. అయితే…ఆంక్షలు ఎత్తివేస్తామన్న భరోసా మాత్రం RBI ఇవ్వలేదు. అందుకే….నేరుగా ఆర్థిక మంత్రినే కలవాలని సీఈవో భావించినట్టు తెలుస్తోంది. అటు ఈడీ కూడా ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారించేందుకు సిద్ధమైంది. కానీ అటు పేటీఎమ్ సంస్థ మాత్రం బ్యాంక్‌కి అవసరమైన వివరాలన్నీ సమర్పించినట్టు వెల్లడించింది. ఈడీ దర్యాప్తుని తిరస్కరించింది.
మరిన్ని చూడండి