Financial crisis in America: అగ్రరాజ్యం అమెరికా(America)లో మరో మూడు, నాలుగు వారాల్లోనే ప్రభుత్వం మారనుంది. కొత్తగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నాయకుడు.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి అధ్యక్ష పీఠం ఎక్కనున్నారు. అయితే.. ఈ క్రమంలో తన మాటే నెగ్గాలని ట్రంప్.. కాదు.. తాము చేసిందే నెగ్గాలని అధికార పక్షం డెమొక్రాట్లు(Democrats) పట్టుబట్టడంతో కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు పెండింగులో పడింది. ఇది శుక్రవారం(డిసెంబరు 20) సాయంత్రానికి పరిష్కారం అయితే.. సరే, లేకపోతే అమెరికాలో ఆర్థిక కార్యక్రమాలకు షట్ డౌన్ ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సహా.. ఇతర కార్యక్రమాలు కూడా నిలిచిపోనున్నాయి.
విషయం ఏంటంటే?
అమెరికా(America)లో ప్రతి 4 మాసాలకు ఒకసారి ప్రభుత్వానికి సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును సభలు ఆమోదిస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం కూడా ఉభయ సభల్లోనూ.. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నించింది. కానీ, దీన్ని తొలుత కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. తాను చేసిన ప్రతిపాదనలను చేర్చాలని కోరారు. దీంతో అప్పటివరకు బిల్లులో చేర్చిన రుణాలపై సీలింగ్(రెండేళ్ల పాటు)ను ఎత్తివేశారు. అనంతరం.. దీనిని ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టారు. దీనిని ఆమోదించేందుకు అందరూ సహకరించాలని ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్(Mick Jhonsan) విన్నవించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. మార్చి(March-2025) 14వ తేదీ వరకు ప్రభుత్వానికి నిధులు సమకూరనున్నాయి.
ఈ రాత్రికి గడువు!
అయితే.. కాబోయే అధ్యక్షుడు ట్రంప్(Trump) చేసిన ప్రతిపాదనను ప్రస్తుత అధికార పక్షం డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఇంకా అధ్యక్షుడు కాలేదని.. ఆయన చెప్పినట్టు బిల్లులో మార్పులు ఎలా చేస్తారని వారు నిలదీస్తున్నారు. ఫలితంగా ప్రతినిధుల సభ దీనిని 235-174 ఓట్ల తేడాతో తిరస్కరించింది. ఫలితంగా ఇప్పుడు కీలకమైన సెనేట్(Senet)లో ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. ఇక్కడ కనుక ఆమోదం పొందితే.. కొంత వరకు బైడెన్(Jeo Biden) సర్కారు ఆర్థిక సమస్య నుంచి గట్టెక్కినట్టే. కానీ, ఇక్కడ కూడా డెమోక్రాట్ల పట్టు కొనసాగుతోంది. దీంతో శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో కాంగ్రెస్ విఫలమైతే షట్‌డౌన్(shutdown) పరిస్థితి ఎదురుకాక తప్పదని అంటున్నారు.
ఏం జరుగుతుంది?
ఒక వేళ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోతే.. ముందుగా ప్రభుత్వం షట్ డౌన్(shutdown) ప్రకటిస్తుంది. దీంతో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల(Employees) వేతనాలు నిలిచిపోనున్నాయి. వీరి సంఖ్య 8,75,000గా ఉందని తెలిసింది. అంతేకాదు.. వీరికి సెలవు ప్రకటిస్తారు. అంటే.. ఆఫీసులకు రావొద్దని సమాచారం అందిస్తారు. అయితే.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి అత్యవసర విభాగాల్లో పనిచేసే మరో 14 లక్షల మంది మాత్రం సేవలను కొనసాగించాల్సి ఉంటుంది. కానీ, వీరికి వేతనాలు ఇస్తారా? ఇవ్వరా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. షట్‌డౌన్ ముగిశాకే.. వారికి వేతనాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా రవాణా శాఖ, ఇతర రంగాలపై షట్‌డౌన్ ప్రభావం ఎక్కువగా ఉండనుందని అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే.. భద్రతా రంగం(పోలీసులు తదితర), వైద్యంపై మాత్రం షట్ డౌన్ ప్రభావం ఉండదని తెలిపాయి. వీరికి సంబంధించిన ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రత్యేక చట్టం రూపంలో ఆమోదం తెలుపుతుంది. కానీ, సోషల్ సెక్యూరిటీ ఆఫీస్‌లు అందించే ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి.
గతంలో కూడా..
అమెరికా ప్రజలకు షట్ డౌన్(shutdown) కొత్తకాకపోవడం గమనార్హం. గతంలో కూడా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ (shutdown) విధించింది. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ఆర్థిక లావాదేవీలు కుంటుబడ్డాయి. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడి(President)గా ఉన్నారు. అయితే.. చిత్రం ఏంటంటే ఒక్కసారి షట్ డౌన్ వచ్చాక అది ఎంత కాలం ఉంటుందనేది చెప్పడం కష్టం. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
మరిన్ని చూడండి