Avadhuta Kasinayana ashram in Nallamala: శ్రీ కాశీనాయన జ్యోతి క్షేత్రం ఆశ్రమంలో అటవీ శాఖ అధికారులు షెడ్ల కూల్చివేత ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగుతోంది. ఇదే విషయంపై కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ ను కలసి విన్నవించారు AP BJP రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి. కాశీనాయన ఆశ్రమం గొప్పతనం, ప్రజలకు చేస్తున్న సేవలు, అటవీ అధికారుల కూల్చివేతల గురించి ప్రస్తావించారు. శ్రీ కాశీనాయన క్షేత్రం గురించి ఆమె ఏం చెప్పారంటే..
శ్రీ కాశీనాయన గౌరవనీయమైన ఆధ్యాత్మిక గురువు. ఆయన బోధనలు కరువు పీడిత రాయలసీమలోని వేలమంది రైతులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆ రైతులంతా మొదటి పంటను దానం చేయడం ద్వారా ఈ ప్రాంతం మొత్తం అన్నదాన క్షేత్రాలు స్థాపించేలా చేశాయి. కాశీనాయన ఆశ్రమాలు, ముఖ్యంగా దట్టమైన అడవిలో ఉన్న ప్రతిష్టాత్మక జ్యోతి క్షేత్రం, లక్షల మంది పేదలకు సేవ చేసింది. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, నెల్లూరు , ప్రకాశం జిల్లాల్లో 100 కి పైగా అన్నదాన సత్రాలను నిర్వహిస్తున్నారు ఆయన భక్తులు. ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ ఉచిత భోజనం అందిస్తున్నారు. ఆయన చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం కడప జిల్లాలో ఓ మండలానికి ఆయన పేరు పెట్టింది. దీనిని “శ్రీ అవధూత కాశీనాయన మండలం” అని పిలుస్తారు. నంద్యాల జిల్లా నల్లమల మధ్యలో ఉన్న ఈ జ్యోతి క్షేత్రంలో కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చివేసేందుకు అటవీ శాఖ తీసుకున్న నిర్ణయం భక్తులలో తీవ్ర ఆందోళన కలిగించింది. రాయలసీమ జిల్లా ప్రజలను కలవరపెట్టింది. నిత్యం వేలమంది భక్తులకు ఆధ్యాత్మిక సామరస్యాన్ని అందిస్తున్న ఈ కేంద్రాన్ని రక్షించుకోవడం చాలా అవసరం అని..పురంధేశ్వరి..కేంద్రమంత్రి భూపేద్రయాదవ్ కు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి..ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తామని, ఆశ్రమ పరిరక్షణకు సహకరిస్తామని చెప్పారు.
దగ్గుపాటి పురంధేశ్వరి నాయకత్వంలో కేంద్రమంత్రిని కలిసిన వారిలో కడప జిల్లాకు చెందిన 13 మంది నాయకులున్నారు. సి ఆది నారాయణ రెడ్డి ఎం.ఎల్.ఎ, కె. రితీష్ రెడ్డి. వి. శశి భూషణ్ రెడ్డి. సి. భూపేశ్ రెడ్డి, సి. రాజేష్ రెడ్డి. పి. సురేష్ , మద్దూర్ నాగరాజు , యర్రం విష్ణువర్ధన్ రెడ్డి , సందీప్ పోలేపల్లి, స్వామి విరాజానంద , బొమ్మన సుబ్బారాయుడు , సంగారెడ్డి శ్రీరామ చంద్ర , పి. ఉమా కాంత్ రెడ్డి ఉన్నారు.
ఈ ఘటనపై ఇప్పటికే స్థానికులు, పలువులు స్వాములు, ఆశ్రమనిర్వాహకులు స్పందించారు. నిత్యం అన్నదానం జరిగే ఈ క్షేత్రంలో నిర్మాణాలు కూల్చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించిన ఏపీ మంత్రి నారాలోకేష్.. ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పారు. అటవీశాఖ అధికారులు ఎక్కడైతే షెడ్డులు కూల్చేశారో అక్కడ పునర్ నిర్మిస్తున్నారు. ఇతరత్రా సహాయం కావాలన్నా తాము అండగా ఉంటామని ఆశ్రమ నిర్వాహకులకు భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతానికి బస్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా ఈ మధ్య అటవీ అధికారులు అన్నదాన షెడ్లను కూల్చివేశారు.
మరిన్ని చూడండి