Harish Shankar to team with Venkatesh హరీష్-వెంకీ ప్రాజెక్ట్ సెట్ అయినట్లేనా

సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో వెంకటేష్ తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. అభిమానులు ఎదురు చూస్తున్న కొత్త సినిమా కోసం వెంకటేష్ ఇప్పటి వరకు 50కి పైగా కథలు విన్నప్పటికీ ఏ కథకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న వార్తలు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణ హిట్‌ అయితే ఇంత ఆలస్యం చేసేవారేమో కానీ తన మార్కెట్ స్థాయి మరింత పెరిగిన నేపథ్యంలో కొత్త కాంబో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

గతంలో పాజిటివ్‌గా స్పందించిన కథలకు కూడా తాత్కాలికంగా వెయిటింగ్‌లో పెట్టేశారట. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్ 77 ప్రాజెక్ట్‌కు సంబంధించి డైరెక్టర్ దాదాపుగా ఫైనల్ అయ్యాడని తెలుస్తోంది. సామజవరగమన సినిమాకు రచనలో భాగమైన నందు దాదాపు ఆరు నెలల క్రితమే వెంకటేష్‌కి ఓ కథ వినిపించాడట. ఈ కథను వెంకటేష్‌తో పాటు సురేష్ బాబు కూడా బాగా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది. 

ఇందులో హాస్యం మాత్రమే కాదు కథలో కొన్ని కీలక ట్విస్టులు కూడా ఉండటంతో ఇది వెంకటేష్‌కి సరైన ప్రాజెక్ట్‌గా మారుతుందనే అభిప్రాయం వచ్చిందట. కానీ నందుకు దర్శకత్వ అనుభవం లేకపోవడంతో ఈ కథను అతనితో చేయించలేమన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే కథను మాత్రం ఎవరైనా అనుభవం ఉన్న దర్శకుడితో చేయించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లారని అంటున్నారు.

అసలైన ట్విస్ట్ ఏమిటంటే ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించబోయేది హరీష్ శంకర్ అని ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. గతంలో మిస్టర్ బచ్చన్ మూవీ విఫలం అయినా హరీష్ శంకర్ టాలెంట్‌పై వెంకటేష్ పూర్తి నమ్మకం పెట్టుకున్నారని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందన్నది ఇంకా క్లారిటీ రాలేకపోయినా నిర్మాతలు 2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మరికొంత సమయం పట్టే అవకాశముండటంతో హరీష్ శంకర్ ఈ లోగా మరో ప్రాజెక్ట్ చేయాలని చూస్తున్నాడట. రామ్, బాలకృష్ణలకు కథలు చెప్పినప్పటికీ అవి కూడా వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతున్నాయట.

ఈ ప్రాజెక్ట్ వెంకటేష్‌తో లాక్ అయితే హరీష్ శంకర్‌కు ఇది సూపర్ ఛాన్స్ అవుతుంది. ఎందుకంటే ఓ భారీ డిజాస్టర్ తర్వాత వెంటనే ఓ స్టార్ హీరోతో సినిమా చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇది పూర్తిగా హరీష్ శంకర్ టాలెంట్‌పై ఆధారపడి ఉంటుంది. మరి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.

Source link