Haryana Clashes:
రాళ్ల దాడి
హరియాణా అల్లర్లలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు ఓ మహిళా జడ్జ్. నూహ్‌లో కార్‌లో వెళ్తుండగా ఆందోళనకారులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ సమయంలో జడ్జ్‌తో పాటు ఆమె మూడేళ్ల కూతురు కూడా కార్‌లోనే ఉంది. దాడి చేయడమే కాదు. పెట్రోల్ పోసి నిప్పంటించారు. రెప్పపాటులో కార్‌లో నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు జడ్జ్. కూతురికీ ప్రాణాపాయం తప్పింది. అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న అంజలి జైన్, తన మూడేళ్ల కూతురితో కలిసి కార్‌లో బయటకు వచ్చారు. కొంత దూరం వరకూ బాగానే ఉన్నా…ఉన్నట్టుండి కార్‌పై రాళ్ల దాడి మొదలైంది. కాల్పులూ జరిపారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అంజలి జైన్ తన కూతురుని తీసుకుని కార్‌లో నుంచి బయట పడ్డారు. పక్కనే ఉన్న ఓ పాత బస్‌స్టాండ్‌లో తలదాచుకున్నారు. తరవాత కొంత మంది న్యాయవాదులు వచ్చి ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్లారు. మందులు కొనుక్కుని వస్తూ ఉండగా ఒకేసారి 100-150 మంది దాడికి పాల్పడ్డారని వివరించారు అంజలి జైన్. ఈ దాడిపై పోలీసులు FIR నమోదు చేశారు.
“ఆందోళనకారులు జడ్జ్ కార్‌పై రాళ్ల దాడి చేశారు. కొన్ని రాళ్లు కార్ వెనక నుంచి దూసుకొచ్చాయి. అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఆ తరవాత కాల్పులు జరిపారు. వెంటనే కార్‌లో నుంచి దిగి బాధితులు వెళ్లిపోయారు. ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నారు. ఓ వర్క్‌షాప్‌లో దాక్కున్నారు. కాసేపటి తరవాత తోటి న్యాయవాదులు వచ్చి రక్షించారు. ఈ దాడిలో కారు పూర్తిగా కాలిపోయింది”
– పోలీసులు