Hope everyones rights are protected Says UN on Arvind Kejriwals arrest

Arvind Kejriwals Arrest News:  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే అమెరికా, జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ రెండు దేశాలకూ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా కేజ్రీవాల్ అరెస్ట్‌పై (UN on Kejriwal arrest) ఓ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియా గటెర్రస్ ప్రతినిధి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి రాజకీయ, పౌర హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా భారత్ కాపాడుతుందన్న నమ్మకం ఉందని వెల్లడించారు. ఎలాంటి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఇలాంటి పరిణామం జరగడం రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. దీన్ని ఉద్దేశిస్తూనే ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేయడమూ మరో సంచలనమైంది. ఏదేమైనా భారత్‌ కచ్చితంగా అందరి హక్కులకీ గౌరవమిచ్చి, వాటిని సంరక్షిస్తుందన్న నమ్మకం ఉందని ఐరాస వెల్లడించింది. 

“భారత్‌లో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో అక్కడ రాజకీయంగా కొంత అలజడి రేగింది. ఏదేమైనా భారత్ అందరి పౌర, రాజకీయ హక్కుల్ని కాపాడుతుందన్న నమ్మకం మాకుంది. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగి అందరూ స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పిస్తుందని అభిప్రాయపడుతున్నాం”

– స్టీఫెన్ డుజరిక్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధి

ఇప్పటికే కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్  చేసిన వ్యాఖ్యలపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించింది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో అన్నీ చట్ట ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సమన్లు జారీ చేసింది. 

 

 

 

మరిన్ని చూడండి

Source link