India China Hold Crucial Talks on Border Issues and to Resume Kailash Mansarovar Yatra Soon | India China Border Issues: బీజింగ్‌లో భారత్, చైనా ప్రతినిధుల కీలక భేటీ

Kailash Mansarovar Yatra News | బీజింగ్: భారత్, చైనా దేశాలు దాదాపు ఐదేళ్ల అనంతరం చర్చలు జరిపాయి. 23వ రౌండ్ ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో పాల్గొనేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ధోవల్ బుధవారం నాడు భేటీ అయ్యారు. గాల్వాన్ లోయలో సైనికుల ఘటన కారణంగా దాదాపు ఐదేళ్లలో ఇరుదేశాల మధ్య ఎలాంటి సమావేశం జరగలేదు. 

సరిహద్దు సమస్యలపై చర్చలు

ఐదేళ్ల విరామం తరువాత జరిగిన తొలి అధికారిక సమావేశంలో అజిత్ ధోవల్, వాంగ్ యీలు సరిహద్దు సమస్య పరిష్కారంపై చర్చించారు. మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించడం సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్, చైనా సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోవడం, వాణిజ్యం కోసం నాథులా సరిహద్దు పునరుద్ధరించడం. సరిహద్దు సమస్యలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చర్చించినట్లు వెల్లడించారు. 

పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలపై ఫోకస్

స్థిరమైన అభివృద్ధి కొనసాగాలంటే సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉండకూడదని, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో భాగంగా 2005లో భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు చేసుకున్న ఒప్పందాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సరిహద్దు సమస్యకు పరిష్కారం కోసం అంగీకరించారు. పొరుగు దేశానికి ఆమోద యోగ్యంగా ఉండేలా సమస్యకు పరిష్కారం ఉండాలని కీలకంగా చర్చ జరిగింది. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రతినిధులు లేక అధికారులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. చైనా-ఇండియా వర్కింగ్ మెకానిజం కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) ద్వారా సమావేశాలు నిర్వహించి సమస్యలకు పరిష్కారం వెతకడానికి ఇరుదేశాల ప్రతినిధులు ధోవల్, వాంగ్ యీ అంగీకరించారు.

Also Read: Elon Musk: మణిపూర్‌ టెర్రరిజానికి ఎలాన్ మస్క్ సాయం – ఉగ్రవాదుల వద్ద స్టార్ లింక్ పరికరాలు – టెస్లా చీఫ్ స్పందన ఇదే !

ప్రస్తుతం జరిగిన సమావేశంలో సమస్యల పరిష్కారానికి ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశాయి. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న మరో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణకు సైతం అంగీకరించారు. దాంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. సరిహద్దు సమస్యలతో పాటు అంతర్జాతీయ అంశాలపై సైతం చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

గాల్వాన్ లోయలో దాడితో పెరిగిన దూరం

గాల్వాన్ లోయలో చైనా సైనికులు ఒక్కసారిగా దాడి చేయడంతో భారత జవాన్లు అమరులయ్యారు. ఆ తరువాత భారత్, చైనాల మధ్య విదేశాంగ శాఖ అధికారులు, ప్రతినిధుల మధ్య అధికారికంగా భేటీలు జరగలేదు. ఇటీవల చైనా విదేశాంగశాఖ మంత్రితో భారత విదేశాంగమంత్రి జై శంకర్ భేటీ కొన్ని కీలక విషయాలపై చర్చించారు. జీ20 సదస్సుకు హాజరైన భారత్, చైనా ప్రతినిధులు ఇరు దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు పునరుద్ధరించే అంశంపై చర్చించారు. అనంతరం భారత ప్రధాని మోదీ, చైనా అధినేతతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దు సమస్యలు, ఇతర వాణిజ్య సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలే మార్గమని వీరు భావించారు. వీరి నిర్ణయంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చైనాకు వెళ్లి బీజింగ్ లో మంత్రి వాంగ్ యీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఏడాది భారత్‌కు చైనా విదేశాంగ మంత్రి, లేక ప్రతినిధి రానున్నారు.

మరిన్ని చూడండి

Source link