Indian-origin Singapore Minister S Iswaran Probed Over Corruption

S Iswaran: 

ఎస్ ఈశ్వరన్‌పై ఆరోపణలు..

భారత సంతతికి చెందిన సింగపూర్ మంత్రి ఎశ్ ఈశ్వరన్ (S Iswaran) అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని లీ జీన్ లూంగ్‌ సెలవు పెట్టి పక్కకు తప్పుకోవాలని ఈశ్వరన్‌కి ఇప్పటికే ఆదేశాలిచ్చారు. సింగపూర్ రవాణా మంత్రిగా ఉన్న ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసుని విచారించేందుకు. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CPIB) ప్రధానికి ఓ విజదజ్ఞప్తి చేసింది. మంత్రి ఈశ్వరన్‌ని విచారించేందుకు అనుమతినివ్వాలని కోరింది. దీనిపై వెంటనే స్పందించారు ప్రధాని లూంగ్. విచారణకు అనుమతినిచ్చారు. ఈ కేసులో నిందితులెవరైనా సరే కచ్చితంగా విచారణ జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. అప్పటి వరకూ ఈశ్వరన్ లాంగ్‌ లీవ్ తీసుకోవాలని ఆదేశించారు. ఆయన స్థానంలో మరో మంత్రిని తాత్కాలికంగా రవాణా మంత్రిగా నియమించారు. భారీ అవినీతిలో మంత్రి హస్తం ఉండటంపై అసహనం వ్యక్తం చేసిన ప్రధాని లూంగ్…నిజానిజాలు త్వరలోనే బయట పడతాయని స్పష్టం చేశారు. CPIB పూర్తిస్థాయిలో విచారణ జరుపుతుందని అన్నారు. 

ఎవరీ ఈశ్వరన్..?

1997లో ఎస్ ఈశ్వరన్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. సింగపూర్‌లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరవాత 2006లో క్యాబినెట్‌లో చోటు దక్కింది. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. సింగపూర్‌ని రీబిల్డ్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇదే ఆయనకు పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టింది. కొవిడ్ సంక్షోభం తరవాత సింగపూర్‌ని Air Hub గా మార్చడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. ఇక ట్రేడ్ రిలేషన్స్‌లోనూ మినిస్టర్ ఇన్‌ఛార్జ్‌గా పని చేశారు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాతికేళ్లు దాటింది. ఎప్పుడూ లేనిది ఈ సారి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే…ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు అన్నది మాత్రం సింగపూర్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. హైప్రొఫైల్ కేసు కావడం వల్ల వివరాలు గోప్యంగా ఉంచుతోంది.

సింగపూర్‌లో ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకి ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అధిక జీతాలు ఇస్తోంది. ఇదే విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటుంది ఆ ప్రభుత్వం. తమ దేశంలో అవినీతికి తావు లేదని తేల్చి చెప్పింది. కానీ…ఇప్పుడు ఏకంగా మంత్రి స్థాయిలోనే అవినీతి జరిగిందన్న ఆరోపణలు రావడం వల్ల వెంటనే అప్రమత్తమైంది. కరప్షన్ పట్ల  “జీరో టాలరెన్స్” విధానానికి కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పింది. 2025లో సింగపూర్‌లో జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని తెలిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తోంది. పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) ఈ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేసింది. CPIB ఎలాంటి వెనకడుగు వేయకుండా విచారణ జరుపుతుందని, నిందితులు ఏ స్థాయి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ప్రధాని లూంగ్‌ వెల్లడించారు. జులై 11 నుంచే విచారణ మొదలవుతుందని రెండ్రోజుల క్రితమే ప్రకటించారు. 

Also Read: North India Floods: ఉత్తరాదిని ముంచెత్తుతున్న వరదలు, కళ్ల ముందే కొట్టుకుపోతున్న ఇళ్లు

Source link