indian railways fined one lakh to catering stall due to selling water bottles more price on mrp | Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది

Indian Railways Fined One Lakh Rupees To Catering Stall: రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలోనూ ఎమ్మార్పీ ధరకే ఏ వస్తువులనైనా విక్రయించాలనేది రూల్. అధిక ధరలకు విక్రయిస్తే జరిమానా తప్పదని రైల్వే శాఖ హెచ్చరించినా కొంతమంది వినడం లేదు. తాజాగా.. ఓ రైల్లో నిర్ణీత ధరకు మించి వాటర్ బాటిళ్లను అమ్మిన ఘటనపై రైల్వే శాఖ (Indian Railways) ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాటరింగ్ కంపెనీకి ఏకంగా రూ.లక్ష ఫైన్ విధించడంతో పాటు ప్రయాణీకుల నుంచి అధికంగా వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించింది. పూజా ఎస్ఎఫ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది.

ప్రయాణికుని ఫిర్యాదుతో..

ఈ నెల 12న పూజా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం.12414).. జమ్ము తావి నుంచి అజ్మీర్ జంక్షన్‌కు బయల్దేరింది. మార్గం మధ్యలో థర్డ్ ఏసీ బోగీలోకి క్యాటరింగ్ బాయ్ వాటర్ బాటిళ్లను తీసుకొచ్చాడు. వాటర్ బాటిల్ ధర రూ.15 ఉండగా, రూ.20కి అమ్మడం మొదలుపెట్టాడు. ఓ ప్రయాణీకుడు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయినా, సదరు క్యాటరింగ్ బాయ్ రూ.20 ఇవ్వాల్సిందేనన్నాడు. అన్ని బోగీల్లో అదే ధరకు వాటర్ బాటిళ్లను విక్రయించడం గమనించిన సదరు ప్రయాణికుడు ఈ విషయాన్ని సెల్ ఫోన్‌లో రికార్డు చేయడంతో పాటు రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139కు కాల్ చేశాడు. రైల్లో ఎమ్మార్పీ ధరకు మించి వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఇలా ఫోన్ కట్ కాగానే అలా క్యాటరింగ్ సంస్థకు రైల్వే నుంచి కాల్ వచ్చింది. వెంటనే ప్రయాణీకుల నుంచి అధికంగా వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.

క్యాటరింగ్ సంస్థకు రూ. లక్ష జరిమానా..

రైల్వే అధికారుల ఆదేశాలతో ఏ క్యాటరింగ్ కుర్రాడు ఎక్కువ ధరకు వాటర్ బాటిళ్లు అమ్మాడో, అదే కుర్రాడు ఎక్కువగా వసూలు చేసిన డబ్బులను ప్రయాణీకులకు అందజేశాడు. అంతే కాదు, విచారణ తర్వాత రైల్వే ఆదేశాలను లెక్క చేయకుండా అధిక ధరకు వాటర్ బాటిళ్లను అమ్మిన సదరు క్యాటరింగ్ సంస్థకు ఏకంగా రూ. లక్ష రూపాయలు జరిమానా విధించింది రైల్వే శాఖ. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఎక్కువ ధరకు అమ్మితే ఫిర్యాదు చేయండిలా..

  • ఏ రైలు, రైల్వే స్టేషన్‌లోనైనా వస్తువులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి. అలా చేయకుంటే రైల్వే శాఖకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చెయ్యొచ్చు. ఎవరైనా ఎమ్మార్పీకి మించి వస్తువులను అమ్మితే వెంటనే 139కి కాల్ చేయాలి.
  • PNR నెంబరును చెబితే కంప్లైంట్ ఫైల్ చేస్తారు. అటు, రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 1800111139కి కాల్ చేసి కూడా కంప్లైట్ చేసే అవకాశం ఉంది. మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చెయ్యొచ్చు. 9717630982కు మెసేజ్ ద్వారా ఫిర్యాదు చెయ్యొచ్చని రైల్వే అధికారులు వెల్లడించారు.

Also Read: Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా !

మరిన్ని చూడండి

Source link