Indian Railways Passenger Safety, First Aid in Trains: సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు, అతి తక్కువ ధరలకే రైళ్లలో ప్రయాణలు చేస్తుంటారు. కేంద్ర రైల్వే శాఖ తమ ప్రయాణికుల కోసం నిత్యం ఏదో ఒక సౌకర్యాన్ని కల్పిస్తూ వారి జర్నీని సులభతరం చేస్తుంటుంది. తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని రైళ్లలో, రైల్వే స్టేషన్లలో అత్యవసర మెడిసిన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో నిపుణుల కమిటీ
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని రైల్వే స్టేషన్లు, అన్ని ప్యాసింజర్ రైళ్లలోనూ ప్రయాణీకుల ప్రాణాలను తక్షణం రక్షించేందుకు వినియోగించే మెడిసిన్, ఫస్ట్ ఎయిడ్ పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్, ఇతరత్రా అత్యవసర మెడిసిన్ కలిగి ఉండేలా మెడికల్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ నిపుణుల కమిటీ రైల్వే శాఖకు ఇటీవల సూచించింది.
ఇటీవల పార్లమెంట్ సమావేశాలలో ఓ రాజ్యసభ ఎంపీ మాట్లాడుతూ.. ప్రయాణికులకు అత్యవసర వైద్య చికిత్స కోసం రైల్వే శాఖ ఏమైనా అధ్యయనం చేసిందా అని ప్రశ్నించార. అన్ని రైల్వే స్టేషన్లలో ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం ఏమైనా ఆలోచించిందా, నిర్ణయాలు తీసుకోనుందా అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ప్రశ్నించారు. అలాంటి నిర్ణయం ఏమైనా ఉంటే తెలపాలని రాజ్యసభలో ఓ ఎంపీ కోరారు.
ఒకవేళ రైల్వే శాఖ అలాంటి అత్యవసర వైద్య చికిత్స సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి తీసుకున్న చర్యలతో పాటు ఎంతమంది ఫ్రంట్‌లైన్ రైల్వే సిబ్బందికి దానిపై శిక్షణ ఇచ్చారని అడిగారు. ఆ సిబ్బందిలో ఎంత మందికి ప్రథమ చికిత్స, ఇతరత్రా వైద్య సహాయం చేయడంతో ట్రైనింగ్ ఇచ్చారో వివరాలు తెలపాలని సభలో రైల్వే మంత్రిని అడిగారు.
రైళ్లు, రైల్వే స్టేషన్లలో వైద్య సౌకర్యాలు అవసరం..
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ ప్రశ్నపై స్పందిస్తూ.. దేశంలోని రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రయాణికులకు వైద్య సౌకర్యాలు కల్పించాల్సిన అవసరంపై సుప్రీంకోర్టు ఇదివరకే పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా న్యూఢిల్లీ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు అన్ని రైల్వే స్టేషన్లలో, ప్యాసింజర్ రైళ్లలో ప్రాణాలు రక్షించే అత్యవసర మెడిసిన్ అందుబాటులో ఉంచాలని కమిటీ సూచించింది. ఫస్ట్ ఎయిడ్ కిట్, ఆక్సిజన్ సిలిండర్ మొదలైన వాటితో మెడికల్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ కమిటీ సూచించినట్లు’ వెల్లడించారు.
ఫ్రంట్-లైన్ సిబ్బంది అంటే రైలు టికెట్ ఎగ్జామినర్, స్టేషన్ మాస్టర్, రైలు గార్డ్‌లు/సూపరింటెండెంట్‌లు అని.. వారికి ప్రథమ చికిత్స అందించడంలో శిక్షణ ఇచ్చినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే సిబ్బందికి రెగ్యులర్ రిఫ్రెషర్ కోర్సులు నిర్వహిస్తామన్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో సమీపంలోని ఆసుపత్రులు, డాక్టర్ల జాబితాతో వారి కంటాక్ట్ నంబర్లతో సహా వివరాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఎవరైనా ప్రయాణికులు గాయపడినా, లేక అనారోగ్యానికి గురైతే వారిని ఆసుపత్రులకు తరలించడానికి రైల్వేల అంబులెన్సులు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అంబులెన్స్ సేవలు వినియోగించుకుంటామని మంత్రి చెప్పారు.
మరిన్ని చూడండి