Israel Kills Hamas Leader Abd al Hadi Sabah Who Led October 7 Attack On Kibbutz | Abd al-Hadi Sabah: డ్రోన్ దాడిలో హమాస్ కమాండర్ హతం – అక్టోబర్ 7 దాడి మాస్టర్ మైండ్ ఇకలేడు

Abd al-Hadi Sabah : హమాస్ పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. హమాస్ కమాండర్ అబ్ద్ అల్-హదీ సబాను అంతమొందించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ – ఐడీఎఫ్ వెల్లడించింది. గాజాలోని ఖాన్ యూనిస్ లో శరణార్ధులు సహాయం పొందుతోన్న ప్రాంతంలో సబాను గుర్తించి, డ్రోన్ తో దాడి చేసినట్టు తెలిపింది. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పై నిర్వహించిన దాడుల్లో అల్-హదీ సబా కీలకంగా వ్యవహరించాడు. 

సబా- కీలక సూత్రధారి

‘అక్టోబరు 7 దాడుల వెనుకున్న కీలక సూత్రధారి, హమాస్ టాప్​ కమాండర్ అబ్దల్‌ హదీ సబాను హతమార్చాం. సబా అనేక ఉగ్రవాద దాడులకు నాయకత్వం వహించాడు. ఆ నాటి దాడులకు కారకులైన మిగతా వారిని సైతం హతమార్చే వరకు మా ఆపరేషన్‌ను కొనసాగిస్తాం’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. అంతకుముందు గతేడాది జనవరిలో హమాస్‌ నాయకుడు సలేహ్‌ అరౌరీని కూడా తామే హతమార్చామని ఇజ్రాయెల్‌ ధృవీకరించింది. లెబనాన్‌పై జరిగిన దాడుల్లో హమాస్‌ డిప్యూటీ పొలిటికల్‌ హెడ్‌, మిలిటెంట్‌ వింగ్‌ వ్యవస్థాపకుడు అరౌరీతో సహా మరో ఐదుగురు హతమయ్యారు. 

‘అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి

అక్టోబరు 7, 2023న హమాస్.. ఇజ్రాయెలీ కిబ్బట్జ్‌ నిర్ ఓజ్ పై తీవ్ర దాడికి పూనుకుంది. ఈ దాడిలో దాదాపు 12వందలకు పైగా మంది ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతటితో ఆగకుండా హమాస్ 251 మందిని బంధించి గాజాకు తీసుకువెళ్లింది. ఆ తర్వాత తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదల చేసింది. అయినప్పటికీ ఇంకా 97మంది హమాస్ బంధీలోనే ఉండిపోయారు. ఆ తర్వాత పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. ప్రస్తుతం వారిలో 51మంది మాత్రమే బతికి ఉన్నట్టు ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. హమాడ్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 45,541మంది ప్రాణాలు కోల్పోగా.. 1,08,338 మందికి గాయాలయ్యాయని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గత ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు ప్రతీకారదాడులతో పాల్పడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అనేక చోట ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ పరస్పక దాడులకు దిగుతున్నాయి. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిస్సైళ్లు, రాకెట్లను సంధిస్తూ వస్తోంది. ఈ దాడుల్లో రెండు గ్రూపులకు చెందిన కీలక నేతలు చనిపోయారు. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతమయ్యారు.

Also Read : China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు – అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!

మరిన్ని చూడండి

Source link