Japan wants four day workweek amid labour shortage | 4 day Work Week: ఉద్యోగులకు శుభవార్త

Japan 4 day Work Week: జపాన్ ప్రజలు చాలా కష్టపడి పనిచేస్తారని ప్రపంచమంతా తెలుసు. ఆ దేశం పేరు వినగానే శ్రామిక శక్తి గుర్తుకు వస్తుంది. అక్కడ రెండు అణుబాంబులు పడినా పట్టుదలతో శ్రమిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతుంది.  ఈ కారణంగా కేవలం కొన్ని దశాబ్దాలలోనే జపాన్ ప్రపంచంలోని అన్ని దేశాల కంటే చాలా అభివృద్ధి చెందింది.. అంతే కాకుండా ప్రపంచంపై ఒక ప్రత్యేక ముద్ర వేసింది. అక్కడి ప్రజలు ఎంతో క్రమశిక్షణగా ఉండడమే కాకుండా, దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. జపాన్ కార్మికుల కొరతను అధిగమించడానికి ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా జపాన్ ప్రజలు వారానికి నాలుగు రోజులు మాత్రమే ఆఫీసులకు వెళ్లాలని కొంత కాలంగా కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జపాన్ ఉద్యోగులకు శుభవార్త అందింది.  

వారానికి నాలుగురోజులే పని
జపాన్ ప్రభుత్వం కార్మికుల కోసం ఓ వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో తక్షణమే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జపాన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల పని విధానం స్వీకరించడానికి ఎక్కువ మంది ఉద్యోగులు, కంపెనీలు ముందుకు వస్తున్నాయి. 2021లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావించారు. ఆ సమయంలో చట్టసభ సభ్యులు ఈ ఆలోచనకు ఓకే చెప్పారు. అప్పట్లో ఆ ఆలోచన అత్యధిక ప్రజాదరణ పొందింది. ఇలా చేస్తే అభివృద్ధి విషయంలో కొంత కాలానికి జపాన్‌ వెనుకపడే ప్రమాదం ఉంటుందని కొన్ని సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేవలం 8శాతం సంస్థలే దానిని అనుసరించాయని ఆరోగ్య, కార్మిక సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మిగతా సంస్థలన్నీ వారంలో ఒక రోజు మాత్రమే ఉద్యోగులకు సెలవు ఇచ్చాయి. 

నిరుద్యోగం తగ్గించేందుకు ప్లాన్
దీని ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.  సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించవచ్చని వివరించింది. ఈ విధానంతో నిరుద్యోగిత రేటు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అంతే కాకుండా తక్కువ పని దినాలు ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లల పెంపకంపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా తక్కువ గంటలు, ఇతర సౌకర్యవంతమైన ఏర్పాట్లు, అలాగే ఓవర్‌టైమ్ పరిమితులకు చెల్లింపు, వార్షిక సెలవులను ప్రవేశపెట్టింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఉచిత కౌన్సెలింగ్, గ్రాంట్లు, కార్మికుల్లో స్పూర్తిని నింపేందుకు సక్సెస్ స్టోరీలకు సంబంధించిన లైబ్రరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్మికులు వారి పరిస్థితులను బట్టి వివిధ రకాల పని పద్ధతులను ఎంచుకునే అవకాశాలను కల్పించింది. దీని వల్ల ప్రతి కార్మికుడిని శక్తివంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ పేర్కొంది .

గుండెజబ్బుల బారిన పడుతున్న కార్మికులు
జపాన్‌లో ఎక్కువశాతం ఉద్యోగస్తులు ఓవర్‌ టైం డ్యూటీలు చేయడం వల్ల కార్మికులు గుండె సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని ఓ నివేదిక వెల్లడించింది. వారానికి నాలుగు పని దినాల పద్ధతినిప్రస్తుతం టోక్యోలోని అకికో యోకోహామా అనే సంస్థ పాటిస్తోంది. దీని ప్రకారం తమ ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు బుధవారం కూడా సెలవు ఇస్తుంది.  ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగులు పని ఒత్తిడికి గురి కాకుండా చురుగ్గా పని చేస్తున్నట్లు అక్కడి యాజమాన్యం పేర్కొంది. అంతే కాకుండా తక్కువ పని దినాలు ఉండటంతో ఉద్యోగులు మరింత వేగంగా పనులను పూర్తి చేయగల్గుతున్నారని సంస్థ పేర్కొంది. 

మరిన్ని చూడండి

Source link