JEE Main 2024: జేఈఈ మెయిన్-2024 సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ర్టాల నుంచి దాదాపు 50 వేల మంది జేఈఈ మెయిన్ పరీక్షలు రాయనున్నారు. పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే అభ్యర్థులను పరీక్షాకేంద్రాల్లోకి పంపిస్తారు. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, ఉర్దూ వంటి ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్-2 (బీఈ/బీటెక్) పరీక్ష నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండోసెషన్‌లో పరీక్ష నిర్వహిచనున్నారు. ఇక ఏప్రిల్ 12న పేపర్-2ఎ (బీఆర్క్), పేపర్-2బి (బీప్లానింగ్) లేదా పేపర్-2ఎ, 2బి రెండూ రాసే అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
బీఈ, బీటెక్ పరీక్షను జనరల్ విద్యార్థులకు 3 గంటలు నిర్వహించనుండగా, దివ్యాంగ అభ్యర్థులకు 4 గంటల పాటు జరుగుతుంది. బీఆర్క్, బీప్లానింగ్ పరీక్షను సాధారణ విద్యార్థులకు మూడున్నర గంటల పాటు నిర్వహించనుండగా, దివ్యాంగ అభ్యర్థులకు నాలుగు గంటల 10 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇప్పటికే ఏప్రిల్ 4, 5, 6న పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అడ్మిట్‌కార్డులను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిగతా వారి అడ్మిట్‌కార్డులను త్వరలోనే విడుదల చేయనుంది.
5 పట్టణాలు తొలగింపు..
జేఈఈ పరీక్షలు నిర్వహించే పట్టణాల జాబితా నుంచి రాష్ట్రంలోని 5 పట్టణాలను తొలగించారు. నిరుడు రాష్ట్రంలో 16 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించగా, ఈ సారి 11 పట్టణాలకే పరిమితం చేశారు. ఈసారి కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని పరీక్షాకేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తారు. ఈసారి జనగామ, మేడ్చల్, సంగారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల పట్టణాలను పరీక్షాకేంద్రాల జాబితా నుంచి తీసేశారు.
పరీక్ష విధానం:
➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు.
➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.
➥ బీఈ, బీటెక్, బీఆర్క్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.
జేఈఈ మెయిన్ పరీక్షలకు ఈ ఏడాది 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ హించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఏపీలోని ప్రధాన నగరాల్లో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్థులకు ముఖ్య సూచనలు..
⫸ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏమాత్రం ఆందోళనకు గురికాకుంగా ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలించాలి. గుడ్డిగా అంచనా వేసి ఆన్సర్లు చేయకూడదు. తెలియని ప్రశ్నను పట్టుకుని, సమయం వృథా చేసుకోవద్దు.
⫸ జేఈఈ మెయిన్స్‌లో నెగెటివ్ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాధానం కచ్చితంగా రాస్తే 4 మార్కులు ఉంటాయి. తప్పుగా టిక్ పెడితే మైనస్–1 అవుతుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఊహించి రాసేకన్నా, వదిలేయడమే మంచిది. కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నల కోసం ముందే సమయం వృథా చేయకూడదు.
⫸ పట్టున్న అంశాలపైనే దృష్టిపెట్టడం మంచిది. లేకపోతే సమయమంతా వృథా అవుతుంది. పరీక్షకు సమయం లేనందున రివిజన్ మాత్రమే చేస్తే బెటర్.
⫸ ప్రతి సబ్జెక్టులో రెండో సెక్షన్‌లో ఇచ్చే న్యుమరికల్ ప్రశ్నలకు మాత్రమే చాయిస్ ఉంటుంది. మొదటి సెక్షన్‌లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు చాయిస్ లేదు.
⫸ పరీక్షలో 40 శాతం ప్రశ్నలు నేరుగా ఫార్ములా బేస్డ్, మరో 40 శాతం పాత ప్రశ్నపత్రాల నుంచి, 10 శాతం ప్రశ్నలు పాత జేఈఈ అడ్వాన్స్‌డ్ నుంచి, మిగతా ప్రశ్నలు ఎక్కువ సమయం పట్టేవి ఇస్తున్నారు.
⫸ విద్యార్థుల్లో ఎక్కువ మంది స్టేట్‌మెంట్స్, అసెర్షన్, రీజన్స్ తరహా ప్రశ్నల్లో తప్పులు చేస్తున్నారు. ఈ తప్పు జరగకుండా ఫార్ములాలను గుర్తుంచుకోవటం మంచిది.
⫸ విద్యార్థులు పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
⫸ అడ్మిట్ కార్డుతోపాటు అవసరమైన పత్రాలన్నీ (సెల్ఫ్ డిక్లరేషన్, అండర్ టేకింగ్ ఫాం) దగ్గర ఉంచుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.
⫸ వాటర్ బాటిల్స్, హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, బాల్ పాయింట్ పెన్నులను అనుమతిస్తారు.
⫸ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు, బ్లూటూట్ ఉపకరణాల వంటి వాటికి అనుమతి లేదు.
JEE (Main) – 2023 Notification
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి…