Karnataka News: పిల్లలకు అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి కానీ మూఢ నమ్మకాలతో సొంత వైద్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. సొంత వైద్యం వేరు.. మూఢ నమ్మకాలు వేరు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జ్వరాలకు విరుగుడు అంటూ అగర్‌బత్తీలతో పిల్లలను కాల్చారు. దాదాపుగా పద్దెనిమిది మంది పిల్లలపై ఇలా అఘాయిత్యానికి పాల్పడటంతో ఒక పాప చనిపోయింది కూడా. ఈ వ్యవహారం కర్ణాటకలో కలకలం రేపుతోంది.
కొప్పల్ జిల్లాలోని ఓ గ్రామంలో సరైన వైద్య సౌకర్యాలు ఉండవు. ప్రజలకు సరిగ్గా అవగాహన కూడా లేదు. అక్కడ పిల్లలకు జ్వరం వస్తే ఏదో దుష్టశక్తి ఆవహిచిందని అనుకుంటారు. దాన్ని తరిమేయడానికి అగర్‌బత్తీలతో కాలిస్తే సరిపోతుదంని అనుకుంటారు ఇటీవల ఆ గ్రామంలో పిల్లలు వరుసగా అనారోగ్యం బారిన పడుతున్నారు. వారిలో పద్దెనిమిది మంది పిల్లల తల్లిదండ్రులు జ్వరాన్ని నయం చేస్తుందనే నమ్మకంతో అగరుబత్తులతో కాల్చారు.ఈ వ్యవహారం ఓ పాప మరణించిన తర్వాతనే వెలుగులోకి వచ్చింది.
కొప్పల్ జిల్లాలో విఠలాపూర్ గ్రామంలో ఏడు నెలల పాప చనిపోయింది. ఈ పాప ఎలా చనిపోయిందో వివరాలు బయటకు తెలిసిన తరవాత సంచలనంగా మారింది. జ్వరం వస్తే అగర్‌బత్తీలతో కాల్చాలన్న మూఢనమ్మకం కారణంగానే పాప చనిపోయినట్లుగా గుర్తించారు. బూడిద దైవ ఆశీర్వాదాలను ఇస్తుందని.. కోలుకోవడానికి దారితీస్తుందని నమ్మి, శిశువు తల్లి తన బిడ్డ జ్వరానికి చికిత్స చేయడానికి మండే అగరుబత్తిని ఉపయోగించినట్లుగా గుర్తించారు. ఫలితంగా శిశువు మరణించిందని గుర్తించారు.
ఈ ఘటన తర్వాత అధికారులు విఠలాపూర్ , పరిసర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా తమ పిల్లలకు వాతలు పెట్టడానికి అగరబత్తీలను ఉపయోగించిన కనీసం 18 ఘటనలను కనుకొన్నారు. అగరబత్తీలతో చర్మాన్ని కాల్చడం వల్ల అనారోగ్యం తొలగిపోతుందని, దేవుళ్లను సంతోషపరుస్తుందని స్థానికులు నమ్ముతారు.
ప్రపంచం అంతా సైన్స్, వైద్యంలో ముందుకెళ్తున్నప్పటికీ ఇక్కడ కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఇటువంటి క్రూరమైన పద్ధతులపై ఆధారపడుతున్నాయని తెలుసుకుని అధికారులు ఆశ్చర్యానికి లోబయ్యారు. ఈ పద్ధతులను ప్రచారం చేసే ‘బాబాలు’ అని పిలిచే వారితో సహా బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
శిశువు మరణాన్ని జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. ఆధునిక ఆరోగ్య సంరక్షణ , పిల్లల భద్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించడానికి అవగాహన డ్రైవ్‌లను ప్లాన్ చేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, నిరంతర విద్య, సమాజ భాగస్వామ్యం ద్వారా అటువంటి మూఢనమ్మకాలను నిర్మూలించడానికి కూడా కృషి చేస్తామని ప్రభుత్వ అధిాకరులు ప్రకటించారు. దేశం సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా ఇలాంటి వారు ఇంకా ఎక్కడో చోట ఉంటారని.. పిల్లల ప్రాణాలను బలి తీసుకుంటారని బయట పడుతూనే ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు వైద్యంపై మరింత స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఇంకా ఉందని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లను ఆపరేట్ చేస్తున్న వారు కూడా మూఢనమ్మకాలనే ఎక్కువగా నమ్ముతూండటం అధికారవర్గాలకూ సవాల్‌గా మారింది.
మరిన్ని చూడండి