Kedarnath temple gates to open for devotees on May 2: ఈ ఏడాది కేదార్ నాథ్ ఆలయం తెరిచే తేదీని ప్రకటించింది ఆలయ బోర్డ్. మే రెండవ తారీఖున ( 2 May 2025) ఉదయం ఏడు గంటలకు హిమాలయాల్లోని కేదార్ నాథ్ ఆలయాన్ని తెరుస్తున్నట్లు శ్రీ బద్రీనాథ్- కేదార్నాథ్ టెంపుల్ కమిటీ ప్రకటించింది. ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున కేధార్ నాద్ ఆలయం తెరిచే తేదీని ప్రకటించడం ఆనవాయితీ. దాని ప్రకారమే ఈ ఏడాది కూడా ఆలయ కమిటీ సీఈవో విజయ ప్రసాద్ తపిలియాల్ ఆ తేదీ ప్రకటించారు.
కేదార్నాథ్ తో పాటే చార్ ధామ్ లోని మిగిలిన ఆలయాలు తెరిచే డేట్లు ఇవే
గార్వాల్ హిమాలయాల్లోని పరమ పవిత్రమైన చార్ ధామ్ పుణ్యస్థలాలుగా పిలుచుకునే మిగిలిన ఆలయాలు తెరుచుకునే తేదీలను కూడా కేదార్నాథ్ తో పాటే ప్రకటించింది బోర్డు. బద్రీనాథ్ ఆలయాన్ని మే 4న, గంగోత్రి,యమునోత్రి దామ్ లను అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 30న తెరుస్తున్నట్టు బద్రీనాథ్ – కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రకటించింది.
Also Read: మణి కర్ణిక ఘాట్ – మీ పూర్వీకుల వివరాలు లభించే అరుదైన పుణ్య స్థలం!
సంవత్సరంలో ఆరు నెలలు మూసి ఉంచే కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో అతి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఉండే కేదార్నాథ్ ఆలయాన్ని ప్రతి ఏటా అక్షయ తృతీయ నుంచి కార్తీక పౌర్ణమి వరకు (ఏప్రిల్ -నవంబర్ ) మాత్రమే తెరిచి ఉంచుతారు. ఆ మిగిలిన ఆరు నెలల పాటు కేదార్నాథ్ ఆలయం మూసి ఉంటుంది. ఆ సమయంలో ఆలయంలోని దేవతా విగ్రహాన్ని క్రిందికి తీసుకువచ్చి ‘ఉక్రిమత్’ అనే ప్రాంతంలో ఉంచి పూజలు జరుపుతారు. మహా ప్రస్థాన సమయంలో పాండవులు ఈ కేదార్నాథ్ ఆలయాన్ని ప్రతిష్టించినట్టు పురాణాల కథనం. విచిత్రంగా కేదార్నాథ్ గురించి భారతంలో ఉండదు. మొట్టమొదటిసారిగా దీని ప్రస్తావన స్కంద పురాణంలో ఉంది.శివుడు ఈ ఆలయ ప్రధాన దైవం. గంగా నది కి ఉపనది అయిన మందాకిని కి అతి దగ్గరలో ఈ కేదార్నాథ్ ఉంది. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ప్రసిద్ధ హిందూ గురువు ఆదిశంకరాచార్య సమాధి కేదార్ నాథ్ దగ్గరలో ఉన్నట్టు కొన్ని స్మారకాలు ఉన్నాయి.( మరో కథనం ప్రకారం ఆయన మరణించింది కంచిలో అని కూడా చెబుతారు).
Also Read: పవిత్ర గంగా హారతికి పుట్టినిల్లు , శివుడిని స్వాగతించేందుకు బ్రహ్మ సృష్టించిన ఘాట్ దశాశ్వమేధ ఘాట్!
వరద విపత్తు లో సైతం చెక్కు చెదరని కేదార్నాథ్
2013లో వచ్చిన ఉత్తరాఖండ్ వరదల్లో చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంతో నష్టం జరిగినా కేదార్నాథ్ మాత్రం చెక్కుచెదరలేదు. పైనున్న కొండల్లో నుంచి దొర్లుకొచ్చిన భారీ శిల కేదార్నాథ్ వెనుకవైపున స్థిరపడి, వచ్చిన భారీ వరద ఆలయాన్ని తాకకుండా కాపాడింది. దీనిని మహాద్భుతంగా భావించిన భక్తులు ఆ రాయికి “భీమ శిల ” గా పేరు పెట్టి పూజలు జరుపుతున్నారు. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారి అయినా దర్శించాలనుకునే అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో కేదార్నాథ్ కూడా ఒకటిగా వెలుగుతోంది.
మరిన్ని చూడండి