కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది-మంత్రి జగదీశ్ రెడ్డి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సరిపడా సాగునీరు, ఉచిత విద్యుత్, పంటపెట్టుబడి పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్నారు. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు వారసత్వాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ శత్రువు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రం నుంచి వెళ్లిపోయినా ఆయన నీడలు, జాడలు తెలంగాణలో మిగిలే ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్‌పై చేసి వ్యాఖ్యలు రైతులపై పిడుగుపాటు లాంటివన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఏంటో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బయటపడిందన్నారు. రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై అవగాహనలేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు 7 గంటల కూడా కరెంటు ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు.