LPG Price Hike: 19-kg Commercial Gas Cylinder To Be Costlier By Rs 209 From Today

LPG Price Hike: దేశంలో మరోసారి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒక్కసారిగా రూ. 209 పెంచాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ రిటైల్ ధర ఇప్పుడు రూ. 1,731.50కు చేరుకుంది. ఈ పెంపు ఆదివారం (అక్టోబర్ 1) నుంచి అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర గతంలో రూ.1,522.50 ఉండేది. తాజాగా రూ.209 పెంపుతో రూ.1731.50కి చేరింది. దీనిపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఈ పెంపు అధికారికంగా ధృవీకరించబడలేదు. దేశంలో సిలిండర్ల ధరలను పెంచినట్లు ANI తెలిపింది. 

ఇటీవల కేంద్రం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 200 తగ్గించింది. దీనితో పాటుగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను గత సెప్టెంబర్ 1న  రూ. 157 మేర తగ్గించేశాయి. దీంతో వరుసగా మూడో నెలలుగా కమర్షియల్ సిలిండర్ల ధరలను తగ్గించినట్లైంది. దాంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1522 వద్దకు దిగి వచ్చింది. ఇది వరకు ఈ ధర రూ. 1680గా ఉండేది. ఇక కోల్‌కతాలో సిలిండర్ ధర రూ. 1636కు దిగి వచ్చింది. ఇది వరకు ఈ రేటు రూ. 1802గా ఉంది. ఇంకా ముంబైలో చూసుకుంటే ఈ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1640 నుంచి రూ. 1482కు దిగి వచ్చింది. కానీ ఈ ధరలు మరోసారి పెరగనున్నాయి.

మూడు నెలల తగ్గుదలకు బ్రేక్
అయితే తాజా నిర్ణయంతో దానికి బ్రేక్ పడింది.  నేటి నుంచి రూ.209 పెంపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1731.50కి చేరింది. అలాగే దేశంలో అయితే కొద్ది కాలంగా అక్టోబర్ 1 నాటికి దేశీయంగా డొమెస్టిక్ ఎల్‌పీజీ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో 14.20 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50గా ఉంది.

75 లక్షల ఉజ్వల కనెక్షన్లు
ఈ నెల ప్రారంభంలో, కేంద్ర మంత్రి వర్గం ఉజ్వల పథకం కింద అదనంగా 75 లక్షల కొత్త LPG కనెక్షన్‌లను ఆమోదించింది. గతంలో ఇచ్చిన ఉజ్వల పథకానికి కొనసాగింపుగా డిపాజిట్ రహిత కొత్త కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. వచ్చే మూడేళ్లలో ఈ కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తారు. ఈ కనెక్షన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై మొత్తం రూ.1,650 కోట్లు భారం పడుతుందని అంచానా.

గ్రామీణ మహిళల కోసమే
గ్రామీణ కుటుంబాల్లో చాలా మంది మహిళలు ఇప్పటికీ కర్రల పొయ్యిలు వినియోగస్తున్నారని, ఫలితంగా వారి ఆరోగ్యాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని కేంద్రం సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వారి కుటుంబాల్లో మార్పులు తెచ్చేందుకు, కలపపై ఆధారపడిన కుటుంబాలకు 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ డిపాజిట్ రహిత కనెక్షన్‌లను ఇవ్వడానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని ఠాకూర్ చెప్పారు.

Source link