Maharastra Government Will Implement New Rule For Car Parking: మహారాష్ట్ర (Maharastra) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టేందుకు కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఇకపై కొత్త కార్లు కొనాలనుకునే వారికి తప్పనిసరిగా పార్కింగ్ స్థలం ఉండాలని తెలిపింది. పార్కింగ్ ప్లేస్ ఉన్న వారికే కార్లు అమ్మాలనే నిబంధనను అమల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని చెప్పారు.
కాగా, నగరంలోని పలు అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న ప్రజలు తగిన పార్కింగ్ స్థలం లేకపోవడంతో తమ కార్లను రోడ్లపైనే పార్క్ చేస్తున్నారు. దీంతో విపరీతమైన రద్దీ నెలకొంది. జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే వేచి ఉండాల్సి వస్తోంది. అలాగే, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు అందించే అత్యవసర సేవలకు సైతం ఆటంకం కలుగుతుంది. వీటిని నివారించడానికే కార్లు కొనుగోలు చేసే వారు పార్కింగ్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించాలనే నిబంధన పెట్టినట్లు మంత్రి సర్నాయక్ తెలిపారు.
త్వరలోనే అమలు
ఈ కొత్త నిబంధనను త్వరలో అమలు చేసేందుకు సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేతో చర్చిస్తున్నామని మంత్రి సర్నాయక్ చెప్పారు. ‘ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మధ్య తరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని మేం చెప్పట్లేదు. అయితే, దానికి అనుగుణంగా పార్కింగ్ స్థలాలు సైతం ఏర్పాటు చేసుకోవాలి. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇలాంటి చర్యలు అవసరం. ట్రాఫిక్ అదుపు చేసేందుకు ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా అదనంగా ముంబయి మెట్రో పాలిటన్ రీజియన్‌లో కేబుల్ ట్యాక్సీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం.’ అని మంత్రి పేర్కొన్నారు.
Also Read: Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు – అద్భుతమైన వీడియో చూశారా?
మరిన్ని చూడండి