Mallikarjun Kharge BJPs Fake Nationalism Visible Again In New Disability Pension Rules For Armed Forces

Mallikarjun Kharge: బీజేపీది నకిలీ జాతీయవాదమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. సాయుధ దళాలకు వికలాంగుల ప్రయోజనాల మంజూరు కోసం కొత్త నిబంధనలు తీసుకురావడపై స్పందించిన ఖర్గే.. బీజేపీది ఫేక్ నేషనలిజం అంటూ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో 40 శాతం ఆర్మీ అధికారులు ప్రభావితం అవుతారని అన్నారు. కేంద్ర సర్కారు కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు, విధానం.. పాత కోర్టు తీర్పులు, నియమాలు, ఆమోదయోగ్యమైన ప్రపంచ నిబధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.

రక్షణ మంత్రిత్వ శాఖ సాయుధ దళాల సభ్యులకు వైకల్య ప్రయోజనాల మంజూరును నియంత్రించే కొత్త నిబంధనలను సెప్టెంబర్ 22వ తేదీన తీసుకువచ్చింది. విధులు నిర్వర్తించే సమయంలో వైకల్యానికి గురయ్యే సాయుధ సిబ్బందికి అందించే పింఛను నిర్వచనాన్ని, అర్హత ప్రమాణాలను, పరిహార పరిమాణాన్ని మారుస్తాయి. 

సాయుధ దళాలకు కొత్త వికలాంగుల పెన్షన్ నిబంధనలు తీసుకురావడంతో బీజేపీ నకిలీ జాతీయవాదం మళ్లీ బయటపడిందని మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. 

‘సుమారు 40 శాతం మంది ఆర్మీ అధికారులు వైకల్యంతోనే పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం కొత్తగా తీసుకువచ్చిన పాలసీ మార్పు గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులు, నియమాలు, ప్రపంచ నిబంధనలను ఉల్లంఘిస్తోంది’ అని మల్లికార్జున్ ఖర్గే తన పోస్టులో రాసుకొచ్చారు.

కేంద్రం ప్రభుత్వ చర్య.. ఇతర ఉద్యోగులతో పోలిస్తే, సైనికులను ప్రతికూల స్థితిలో ఉంచిందని.. ఆల్ ఇండియా ఎక్స్-సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఉటంకిస్తూ చెప్పారు. మాజీ సైనికుల సంఘం చట్టం, సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా కేంద్రం తీసుకువచ్చిన కొత్త విధానం ఉందని, దానిని వెంటనే రద్దు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. జూన్ 2019లో వికలాంగుల పింఛన్లపై పన్ను విధిస్తామని మోదీ ప్రకటించిందని.. ఇప్పుడు ఇలాంటి ద్రోహం చేసిందని ఖర్గే అన్నారు. 

సైనికుల కోసం మోదీ ప్రభుత్వం వద్ద నిధులు లేవని అగ్నిపథ్ పథకం స్పష్టంగా ఒప్పుకుందని ఖర్గే పేర్కొన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, సీఎస్డీ ఔట్‌లెట్ల ద్వారా రేషన్ ఇవ్వడాన్ని ప్రైవేటు పరం చేయడం కూడా సాయుధ దళాల సిబ్బంది సంక్షేమానికి విరుద్ధమని అన్నారు. సైనికుల మనోవేదనను, ఇబ్బందులను పరిష్కరించడానికి వీలైనంత త్వరగా మాజీ సైనికుల కమిషన్ ను ఏర్పాటు చేయాలని మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. షార్ట్ సర్వీస్ కమీషన్ కింద దేశానికి పరాక్రమంగా సేవలందించిన మన వీర జవాన్లకు వైద్య ప్రయోజనాలను, పింఛను ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం లాక్కుందని మండిపడ్డారు.

Source link