Manipur Violence Beti Bachao Has Now Turned Into Beti Jalao Mamata Banerjee Fierce Attack On BJP | Manipur Violence: బేటీ బచావో నినాదం ఏమైపోయింది? మీ మనసు చలించడం లేదా

Manipur Violence: 

మమతా విమర్శలు..

మణిపూర్‌ వైరల్ వీడియోపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కోల్‌కత్తాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె బీజేపీపై మండి పడ్డారు. బేటీ బచావో అని నినాదాలు చేసే బీజేపీ…మణిపూర్‌లో మహిళలకు అన్యాయం జరుగుతుంటో ఏం చేస్తోందని ప్రశ్నించారు. రెజ్లర్ల ఆందోళనలనూ ప్రస్తావించారు దీదీ. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌కి బెయిల్ ఎలా ఇచ్చారని ఫైర్ అయ్యారు. మణిపూర్‌లో అంత జరుగుతున్నా మీకేమీ పట్టలేదా అని ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెన్ని రోజులు ఇలాంటి దారుణాలు చూడాలని ప్రశ్నించారు. 

“మీరు బేటీ బచావో అంటూ గొప్ప నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడా సిద్ధాంతం ఎక్కడికిపోయింది..? మణిపూర్‌ తగలబడిపోతోంది. దేశమంతా ఆగ్రహంతో ఊగిపోతోంది. బిల్కినో బానో కేసులో నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులోనూ బ్రిజ్ భూషణ్‌కి బెయిల్ వచ్చింది. ఈ దేశంలోని మహిళలంతా ఏకమై మీ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో పడగొడతారు”

– మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

వెనకబడిన వర్గాలు ఇంకెంత కాలం ఇలాంటి దారుణాలకు బలి కావాలని ప్రశ్నించారు దీదీ. మణిపూర్‌ ప్రజల్ని ఇలా చూస్తూ వదిలేయలేమని తేల్చి చెప్పారు. 

“మణిపూర్‌లో జరిగిన ఘటన మీలో (మోదీని ఉద్దేశిస్తూ) ఏ మాత్రం చలనం కలగించలేదా..? పదేపదే పశ్చిమ బెంగాల్‌వైపు వేలెత్తి చూపిస్తారు. మరి మీకు మహిళలపై గౌరవం, ప్రేమ లేవా..? ఇంకెంత కాలం దళిత మహిళలు ఇలాంటి దారుణాలకు బలి కావాలి. మైనార్టీలు ప్రాణాలు కోల్పోవాలి. మణిపూర్‌ ప్రజల్ని ఇలా వదిలేయలేం”

– మమతా బెనర్జీ,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 

INDIA పర్యటన..? 

 ఇటీవలే ఏర్పడిన విపక్ష కూటమి INDIAలోని నేతల్ని మణిపూర్‌కి వెళ్లి పర్యటించాలని కోరినట్టు మమతా బెనర్జీ వెల్లడించారు. త్వరలోనే పర్యటన తేదీలు ఖరారు చేస్తామని తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా త్వరలోనే ఉద్యమం మొదలు పెడతామని స్పష్టం చేశారు. అక్టోబర్ 2వ తేదీన ఢిల్లీలో ఉద్యమిస్తారమని మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనికి నిరసిస్తూనే ఢిల్లీలో పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే మమతా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాని పదవిపై ఆసక్తి లేదని, బీజేపీ పాలన అంతం కావాలని మాత్రమే కోరుకుంటున్నానని తేల్చి చెప్పారు.  

Also Read: మమతా ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దుండగుడు, అరెస్ట్ చేసిన పోలీసులు – ఆయుధాలు సీజ్

Source link