Massive Building Fire In South Africa’s Johannesburg, More Than 60 Killed | సౌతాఫ్రికాలో ఘోర అగ్ని ప్రమాదం, బిల్డింగ్‌లో ఉన్నట్టుండి మంటలు

Johannesburg Fire Accident: 

ఐదంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం..

సౌతాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 5 అంతస్తుల భవనంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 63 మంది అగ్నికి ఆహుతయ్యారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పొగ కారణంగా చాలా మంది ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకూ 63 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక్కో ఫ్లోర్‌ వారీగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకు ఇంకా సమయం పట్టే అవకాశముందని తెలిపారు. పూర్తిగా కాలిపోయిన మృత దేహాలను వెలికి తీసి వీధిలోనే ఉంచాల్సి వస్తోంది. ఆంబులెన్స్‌లు వరుసగా వచ్చి డెడ్‌బాడీస్‌ని తీసుకెళ్తున్నాయి. స్థానికంగా ఈ ఘటన ఆందోళన కలిగించింది. అయితే…ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియలేదు. అర్ధరాత్రి ఉన్నట్టుండి మంటలు చెలరేగినట్టు స్థానికులు వెల్లడించారు. ప్రస్తుతానికి బిల్డింగ్‌ని ఖాళీ చేయించారు. చాలా మంది భవనంలోనే చిక్కుకుపోయి ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతమంతా పోలీసుల మొహరించారు. ఇదో అక్రమ నిర్మాణం అని ఇప్పటికే అధికారులు తేల్చి చెప్పారు. జూన్‌లోనూ ఇదే జొహన్నస్‌బర్గ్‌లో ఓ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 

Source link