Modi surname case: న్యూఢిల్లీ: ‘మోదీ ఇంటిపేరు’కు సంబంధించిన పరువునష్టం కేసులో తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు బుధవారం తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు తనకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిడ్ దాఖలుచేశారు. తాను నిర్దోషినని, కోర్టు తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని కోరారు. తనపై చేసిన నేరారోపణలు సరైనవి కావని, ఈ విషయంపై క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంటే ఇప్పటికే తాను ఆ పని చేసి ఉండేవాడినని అన్నారు.
ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీకి క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన కారణంగా ‘అహంకారి’ వంటి పదాలను ఆయన ఉపయోగించారని రాహుల్ గాంధీ తన అఫిడవిట్‌లో ఆరోపించారు. తాను తప్పు చేయకున్నా క్షమాపణ చెప్పాలని కోరుతున్నారని పేర్కొన్నారు. క్షమాపణ చెప్పలేదని న్యాయ ప్రక్రియకు వెళ్లడం కచ్చితంగా ప్రజాప్రాతినిధ్య చట్టంను దుర్వినియోగం చేయడమే అని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.