మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎల్2 ఎంపురాన్ మార్చి 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా 2019లో వచ్చిన లూసిఫర్ కి సీక్వెల్‌గా రూపొందించబడింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దాదాపు రూ.140 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇచ్చిన తాజా ప్రకటనలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఎల్2 ఎంపురాన్ చిత్రానికి మోహన్ లాల్ ఏ రెమ్యునరేషన్ తీసుకోలేదని దర్శకుడు వెల్లడించారు. సినిమా నిర్మాణం అనుకున్న దానికంటే భారీగా ఖర్చవుతుండటంతో మోహన్ లాల్ తన పారితోషికాన్ని పూర్తిగా వదులుకున్నారని చెప్పారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంతోనే సినిమా షూటింగ్ అంతరాయం లేకుండా కొనసాగిందని తెలిపారు.
ఈ సినిమాలో మోహన్ లాల్ స్టీఫెన్ నెడుంపల్లి పాత్రలో కనిపించనుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ జయేద్ మసూద్ పాత్ర పోషిస్తున్నారు. మొదటి భాగమైన లూసిఫర్ అత్యద్భుత విజయాన్ని సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమాకు కావాల్సిన బడ్జెట్ పెరగడంతో మోహన్ లాల్ తన రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లారని తెలుస్తోంది.
ఈ సినిమా దర్శకుడిగా పనిచేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ నటుడిగానూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాను కూడా ఈ చిత్రానికి రెమ్యునరేషన్ తీసుకోలేదని సినిమా విడుదలైన తర్వాత లాభాల్లో వాటా పొందే అవకాశముందని అంటున్నారు.
ఇటీవల మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న కన్నప్ప సినిమాలో మోహన్ లాల్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మంచు విష్ణు మాట్లాడుతూ మోహన్ లాల్ గారిని రెమ్యునరేషన్ గురించి అడిగితే ఆయన నవ్వుతూ నువ్వు అంత పెద్దవాడివయ్యావా..? అని అన్నారు అని వెల్లడించారు. అంతేకాదు ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం పారితోషికం తీసుకోలేదని ఇటీవల ప్రకటించారు.
ఈ సంఘటనలతో మోహన్ లాల్, పృథ్వీరాజ్, ప్రభాస్ వంటి అగ్రతారలు సినిమాలపట్ల చూపుతున్న అంకితభావం, ప్రేమను మళ్లీ నిరూపించారు. ఎల్2 ఎంపురాన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.